పీఆర్సీ అమలు ఉత్తర్వులను సవాలు చేస్తూ వేసిన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా హైకోర్టులో పలు పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ వ్యాజ్యంపై కాసేపు విచారణ జరిపిన ధర్మాసనం.. రోస్టర్ ప్రకారం అది తమ వద్దకు విచారణకు రాకూడదని, తగిన బెంచ్ వద్దకు వెళ్లాల్సిందని పేర్కొంది. ‘పిటిషన్లో అభ్యర్థన చూస్తుంటే ఓవైపు ఉద్యోగి సర్వీసు సంబంధ వ్యవహారంగా, మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులందరి ప్రజాప్రయోజనంగా కనిపిస్తోంది. ఏపీ విభజన చట్టంతో ముడిపడి ఉందని భావించిన హైకోర్టు రిజిస్ట్రీ ఈ వ్యాజ్యాన్ని మా వద్దకు పంపి ఉంటారు. వాస్తవానికి విభజన చట్టం కారణంగా ప్రస్తుత సమస్య తలెత్తలేదు. రోస్టర్ ప్రకారం తగిన బెంచ్ ముందుకు వ్యాజ్యం విచారణకు వెళ్లేందుకు ఫైల్‌ను ప్రధాన న్యాయమూర్తి వద్ద ఉంచాల’ని రిజిస్ట్రీని ఆదేశించింది. జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ బీఎస్ భానుమతితో కూడిన ధర్మాసనం సోమవారం ఈ ఆదేశాలిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 17న ఇచ్చిన పీఆర్సీ అమలు ఉత్తర్వులను సవాలుచేస్తూ ఏపీ గెజిటెడ్ అధికారుల ఐకాస ఛైర్మన్ కేవీ కృష్ణయ్య హైకోర్టులో వ్యాజ్యం వేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది పదిరి రవితేజ వాదనలు వినిపించారు. ‘పీఆర్సీ ఉత్తర్వులతో ఉద్యోగుల జీతాల్లో కోతపడుతోంది. విశ్రాంత ఐఏఎస్ అధికారి అశుతోష్ మిశ్ర కమిషన్ ఇచ్చిన నివేదికను బహిర్గతం చేయలేదు. ఆ నివేదికను పరిశీలించేందుకు కార్యదర్శులతో కమిటీ వేసింది. ఏ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని పీఆర్సీ నిర్ణయించారో తెలీదు. ఏపీ విభజన చట్టం సెక్షన్ 78(1) ప్రకారం హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చిన ఉద్యోగుల ప్రయోజనాలకు రక్షణ ఉంది. కొత్తగా ప్రకటించిన పీఆర్సీని 2018 జూన్ 1 నుంచి వర్తింపజేస్తున్నారు. డీఏను సర్దుబాటు చేస్తున్నామని చెబుతున్నారు. ఉద్యోగులకు అదనంగా జీతాలు చెల్లించి ఉంటే, వాటిని రాబట్టుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని జీవోలో స్పష్టంచేశారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు’ అన్నారు.
ఆ అధికారం ప్రభుత్వానికి ఉంది
ధర్మాసనం స్పందిస్తూ.. పీఆర్సీతో ఉద్యోగుల జీతాలు తగ్గాయా? పెరిగాయా? చెప్పాలంది. ‘పీఆర్సీ కమిషన్ సిఫారసు మాత్రమే చేస్తుంది. నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమే. సర్దుబాటు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. అదనంగా చెల్లించి ఉంటే రాబట్టుకోవచ్చు. తక్కువగా చెల్లించి ఉంటే ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. జీతం తగ్గితే ఉద్యోగి అభ్యంతరం చెప్పొచ్చు. మొత్తంగా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టలేరు’ అని పేర్కొంది. ‘ఆదాయ, వ్యయాలను చూసుకోవాల్సింది ప్రభుత్వమే. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోతే యజమానిగా జీతాలను తగ్గించొచ్చు’ అని వ్యాఖ్యానించింది.