వేతన సవరణ (పీఆర్సీ) జీవోను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై ఏ ధర్మాసనం విచారణ జరపాలనే విషయంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర మరోసారి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. శుక్రవారం ఈ వ్యాజ్యం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి వద్దకు విచారణకు వచ్చింది. వాదనల ప్రారంభ సమయంలో ఏజీ ఎస్.శ్రీరామ్ జోక్యం చేసుకుంటూ.. రిట్ నిబంధన 14(ఏ)(6) ప్రకారం ఈ వ్యాజ్యాన్ని ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారించాలన్నారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ఈ వ్యాజ్యం ఏ బెంచ్ వద్దకు విచారణకు రావాలో పరిపాలనపరమైన నిర్ణయం తీసుకునేందుకు ఫైలును సీజే ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు.
జీతం తగ్గుతోంది:
పిటిషనర్ కేవీ కృష్ణయ్య ప్రధాన వ్యాజ్యంలో అనుబంధ పిటిషన్ వేశారు. పీఆర్సీ వల్ల తనకు జీతంలో రూ.6072 తగ్గుతోందన్నారు. 2015 పీఆర్సీ, 2022 పీఆర్సీ ఆధారంగా ఎంత జీతం వస్తోందో గణాంకాలను పేర్కొన్నారు. 2015 డీఏ ఆధారంగా వచ్చే జీతం, 2022 డీఏఆధారంగా వచ్చే జీతాన్ని ప్రస్తావించారు.