ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

INTER: ఇంటర్ ఆన్​లైన్​ ప్రవేశాలపై తీర్పు వాయిదా!

ఇంటర్ ప్రవేశాలను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించాలన్న ప్రభుత్వ , ఇంటర్ బోర్డు నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్​లో ఉంచింది.

hc on inter online admissions
hc on inter online admissions

By

Published : Aug 26, 2021, 7:28 AM IST

ఇంటర్ బోర్డు తీసుకున్న ఆన్ లైన్ విధానంలో ప్రవేశాలు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సెంట్రల్ ఆంధ్రా జూనియర్ కాలేజ్ మేనేజ్​మెంట్స్ అసోసియేషన్ కార్యదర్శి దేవరపల్లి రమణరెడ్డి, మరికొందరు విద్యార్థులు హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై బుధవారం విచారణ జరిపిన హైకోర్టు.. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ఆన్‌లైన్‌ ప్రవేశాలకు నిబంధనలు రూపొందించలేదని.. విధానాన్ని ప్రకటించలేదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. పత్రిక ప్రకటన ద్వారా ఇంటర్ బోర్డు ఆన్‌లైన్‌ విధానాన్ని ప్రకటించిందని తెలిపారు. గతేడాది పత్రిక ప్రకటన ద్వారా ఆన్‌లైన్ విధానం తీసుకొస్తే హైకోర్టు తప్పుపట్టిందని గుర్తు చేశారు. గతేడాదికి ఇప్పటికీ తేడా ఏమీ లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, బోర్డు చర్యలు చట్టవిరుద్ధమని తెలిపారు.

కొవిడ్ ఉంటే తరగతులెలా నిర్వహిస్తారు..

విద్యార్థులు కొవిడ్ బారిన పడకుండా ఉండేందుకు ఆన్‌లైన్‌ ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు ఇంటర్ బోర్డు చెబుతోందని.. మరి కొవిడ్ ఉంటే ఈనెల 16 నుంచి ఇంటర్ రెండో సంవత్సర విద్యార్థులకు ప్రత్యక్షంగా తరగతులు నిర్వహించేందుకు ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుందని ప్రశ్నించారు . ఆన్​లైన్ ప్రవేశాలు నిర్వహించడం కోసం కొవిడ్​ను ఓ సాకుగా చూపుతున్నారని తెలిపారు. విద్యార్థులు నచ్చిన కళాశాలను ఎంచుకునే హక్కును హరిస్తున్నారన్నారు. ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు ఉంటాయని చెప్పడం వాస్తవం కాదన్నారు. కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలు నిర్వహించలేదన్న పిటిషనర్ల తరపు న్యాయవాది.. అంతర్గత మార్కుల ఆధారంగా గ్రేడ్స్ ఇచ్చి ఉత్తీర్ణుల్ని చేశారన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు అనే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు.

తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టరాదు..

విధానాలను రూపొందించాల్సింది ప్రభుత్వం అయితే అందుకు భిన్నంగా ఇంటర్ బోర్డు వ్యవహరించిందని.. విద్యార్థుల జీవితంతో ముడిపడి ఉన్న విషయంలో ఆన్‌లైన్ విధానం తీసుకురావడంలో సహేతుక లేదన్నారు. చివరి నిమిషంలో నిర్ణయం తీసుకొని విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. ఇంటర్ బోర్డు నోటిఫికేషన్‌కు చట్టబద్ధత లేదని తెలిపారు. ఆన్‌లైన్‌ ప్రవేశాల నిమిత్తం ఇంటర్ బోర్డు ఈ నెల 10న ఇచ్చిన ప్రొసీడింగ్​ను రద్దు చేయాలని కోరారు.

ఇంటర్మీడియట్ బోర్డు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సూచన మేరకు ఆన్‌లైన్ విధానాన్ని తీసుకొచ్చామన్నారు. ప్రవేశాల కోసం తల్లిదండ్రులు కళాశాలల చుట్టూ తిరగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు . పరీక్షలు నిర్వహణ కారణంగా కొవిడ్​తో ఏ ఒక్క విద్యార్థికి హాని జరిగినా భారీగా పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిందని.. అందుకే పది పరీక్షలు రద్దు చేశారని తెలిపారు . సుప్రీం ఆదేశాలు , కరోనా పరిస్థితుల కారణంగా ఆన్‌లైన్‌ ప్రవేశాలకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ నిర్ణయం వెనుక విస్తృత ప్రజాప్రయోజనం ఉందన్నారు. ఇప్పటికే రెండున్నర లక్షల మంది విద్యార్థులు ఆన్​లైన్ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.

పారదర్శక ప్రవేశాల కోసమే..

పారదర్శక ప్రవేశాల కోసమే ఆన్‌లైన్‌ విధానం, సందేహాల నివృత్తికి సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఆన్ లైన్​లో తరగతులు నిర్వహిస్తే లేని అభ్యంతరం ప్రవేశాలపై ఎందుకన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని వ్యాజ్యాల్ని కొట్టేయాలని కోరారు. ఆన్​లైన్ ప్రవేశాలకు ఈ నెల 27 వరకు ఉన్న సమయాన్ని మరికొంత కాలం పొడిగించాలని న్యాయస్థానం ఆదేశిస్తే అందుకు సిద్ధం అన్నారు. ఇరువైపుల వాదనలు ఉన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.

ఇదీ చదవండి:విద్యార్థి మృతిపై ఆర్జేడీతో విచారణ జరుపుతున్నాం : మంత్రి సురేశ్‌

ABOUT THE AUTHOR

...view details