ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రుణం కోసం గవర్నర్‌ పేరు ఎలా వాడతారు?.. ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న - ఏపీ హైకోర్తు తాజా వార్తలు

ప్రభుత్వ ఆస్తులను తాకట్టుపెట్టి తీసుకున్న రుణాలను చెల్లించడంలో విఫలమైతే గవర్నర్‌కు ఆయా బ్యాంకులు నోటీసులు జారీ, కేసులు దాఖలు చేసేందుకు వీలుకల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడాన్ని హైకోర్టు ఆక్షేపించింది. అధికరణ 361 ప్రకారం గవర్నర్‌పై కేసులు నమోదు చేయడానికి వీల్లేకుండా రక్షణ ఉందని గుర్తుచేసింది.

hc on governor in debit issue
hc on governor in debit issue

By

Published : Oct 8, 2021, 7:02 AM IST

Updated : Oct 8, 2021, 7:22 AM IST

ఏపీ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ (ఏపీఎస్‌డీసీ) కోసం ప్రభుత్వ ఆస్తులను తాకట్టుపెట్టి తీసుకున్న రుణాలను చెల్లించడంలో విఫలమైతే గవర్నర్‌కు ఆయా బ్యాంకులు నోటీసులు జారీ, కేసులు దాఖలు చేసేందుకు వీలుకల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడాన్ని హైకోర్టు ఆక్షేపించింది. అధికరణ 361 ప్రకారం గవర్నర్‌పై కేసులు నమోదు చేయడానికి వీల్లేకుండా రక్షణ ఉందని గుర్తుచేసింది. బ్యాంకులతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటూ గవర్నర్‌కు రాజ్యాంగం కల్పించిన సార్వభౌమా ధికారాన్ని ఎలా రద్దు చేస్తుందని ప్రశ్నించింది. హామీ ఒప్పంద దస్త్రంలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ పేరును చేర్చడంపై అభ్యంతరం తెలిపింది. ఆయనే ఎప్పుడూ గవర్నర్‌గా ఉండరు కదా అని వ్యాఖ్యానించింది. రుణాలు పొందే ఈ వ్యవహారంలోకి గవర్నర్‌ను ఎలా తెరపైకి తెస్తారని ప్రశ్నించింది. అన్నీ సవ్యంగా ఉంటే రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ఎందుకు విముఖత చూపుతాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఏపీఎస్‌డీసీ రుణ వ్యవహారంతో ముడిపడిన మూడు ప్రజాహిత వ్యాజ్యాలు, వాటిలోని అనుబంధ పిటిషన్లపై కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఆ రోజు విచారణలో అనుబంధ పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఏపీఎస్‌డీసీ రుణం విషయంలో తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, విజయవాడకు చెందిన కె.హిమబిందు, తెనాలికి చెందిన ఎం.వెంకట గ్రీష్మకుమార్‌ వేర్వేరుగా ప్రజాహిత వ్యాజ్యాలు వేశారు.

ఇక మీదట తాకట్టు పెట్టకుండా నిలువరించండి: వడేరా

ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తరఫు న్యాయవాది బాలాజీ వడేరా వాదనలు వినిపిస్తూ.. ‘హైకోర్టులో వ్యాజ్యం పెండింగ్‌లో ఉండగా విశాఖలోని 13 ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టి రుణం తీసుకున్నారు. ఏ ప్రభుత్వమూ ఇలా రుణం తీసుకోవడం నా న్యాయవాద వృత్తి జీవితంలో చూడలేదు. ఇది స్కీమ్‌ కాదు స్కామ్‌. రాజ్యాంగం గవర్నర్‌కు సార్వభౌమాధికారం కల్పించినా.. ఆయనపై కేసులు, వ్యాజ్యాలు దాఖలు చేసేందుకు వీలుగా రుణాన్ని తిరిగి చెల్లించే హామీ ఒప్పంద పత్రంలో పేర్కొన్నారు. ఇకమీదట ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండా మధ్యంతర ఉత్తర్వులివ్వండి’ అని కోరారు.

ఆస్తులపై రుణం పొందడం కొత్త కాదు: దవే

రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌దవే వాదనలు వినిపిస్తూ.. ‘పిటిషనర్‌ తెదేపా ఎమ్మెల్యే. ఏపీఎస్‌డీసీ చట్టాన్ని తీసుకురాకుండా నిలువరించడంలో అసెంబ్లీలో విఫలమై.. న్యాయస్థానాన్ని వేదికగా చేసుకొని పిల్‌ దాఖలుచేశారు. ఇది రాజకీయ ప్రేరేపిత వ్యాజ్యం. పిటిషనర్లు బ్యాంకులకు లేఖలు పంపుతూ రుణాలివ్వకుండా అడ్డుకుంటున్నారు. దీంతో చివరి విడతగా రావాల్సిన రుణాలు ఆగిపోయాయి. విశాఖలోని ప్రభుత్వ ఆస్తులను చట్టబద్ధంగానే తాకట్టు పెట్టాం. ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టి రుణం పొందడం కొత్త కాదు. కేంద్రం ఈ విషయంలో ఓ పథకాన్ని అమలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు, ఒప్పందాలు అన్నీ గవర్నర్‌ పేరుతోనే జరుగుతాయి’ అన్నారు.

పరోక్షంగా నెరవేర్చుకుంటున్నారు

హిమబిందు తరఫు న్యాయవాది బి.నళిన్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. ‘ప్రభుత్వ ఆస్తులను వేలంలో అమ్మే ప్రక్రియను సవాలు చేస్తూ ఇప్పటికే హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వాటిలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. దీంతో ఆ ఆస్తులను తాకట్టు పెట్టి రుణాలు పొందుతూ పరోక్షంగా ప్రభుత్వం తన ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటోంది’ అన్నారు. వెంకట గ్రీష్మకుమార్‌ తరఫు న్యాయవాది గూడపాటి వెంకటేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. అదనపు ఎక్సైజ్‌ సుంకం విధించి ఆ మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించేలా ఎస్క్రో ఒప్పందం చేసుకోవడం చట్ట విరుద్ధమన్నారు.

ఇదీ చదవండి:ED Raids: శ్రీకృష్ణ జువెల్లరీస్ సంస్థపై ఈడీ దృష్టి... ఏకకాలంలో దాడులు

Last Updated : Oct 8, 2021, 7:22 AM IST

ABOUT THE AUTHOR

...view details