నైపుణ్యాభివృద్ధి సంస్థ మాజీ ఎండీ గంటా సుబ్బారావుకు హైకోర్టు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. మొదటి ఎండీగా ఆ ప్రాజెక్టు ప్రతిపాదన సిద్ధం చేశారనే కారణం తప్ప ఆయనపై మరో ఆరోపణ కనిపించడం లేదని పేర్కొంది. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆయనకు బెయిలు మంజూరు చేసింది. 2 లక్షల రూపాయలు విలువ కలిగిన రెండు పూచీకత్తులు సమర్పించాలని, ప్రతి శనివారం మధ్యాహ్నంలోపు సీఐడీకి అందుబాటులో ఉండాలని షరతు విధించింది . పిటిషనర్ హాజరు అవసరం అనుకుంటే 24 గంటల ముందుగా నోటీసు ఇవ్వాలని సీఐడీకి స్పష్టం చేసింది. న్యాయస్థానం లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేశ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
సీఐడీపై ప్రశ్నల వర్షం..
ఈ వ్యాజ్యం విచారణ సందర్భంగా సీఐడీ తీరుపై న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు ప్రశ్నలు సంధించారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన సీమెన్స్ ప్రాజెక్టు వ్యవహారంలో నిధులు దుర్వినియోగం అయ్యాయనే ఆరోపణతో సీఐడీ నమోదు చేసిన కేసులో బెయిలు మంజూరు చేయాలని కోరుతూ గతంలో ఆ సంస్థ సీఈవో, ఎండీగా వ్యవహరించిన గంటా సుబ్బారావు హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి.. బిల్లులు చెల్లించిన అధికారిని నిందితుడిగా ఎందుకు పేర్కొనలేదని సీఐడీని ప్రశ్నించిన విషయం తెలిసిందే. గంటా సుబ్బారావుకు ఆర్థికశాఖలతో సంబంధం లేదని ఆయన తరఫు సీనియర్ న్యాయవాది చెబుతున్నారు. నైపుణ్యాభివృద్ధి సంస్థకు మొదటి సీఈవో, ఎండీగా.. ప్రాజెక్ట్ ప్రతిపాదనను మాత్రమే సిద్ధం చేశారు. కమిటీ బృందం వాటిని పరిశీలించింది. ప్రాజెక్ట్ వివరాలు కేంద్ర ప్రభుత్వ సంస్థకు వెళ్లాయి. కేంద్రం నుంచి అనుమతి లభించింది. పిటిషనర్‌కు సొమ్ము బదిలీ వ్యవహారం తెలీదని చెబుతున్నారు. అలాంటప్పుడు రెండు నెలలుగా ప్రాథమిక దర్యాప్తు చేసి ఏమి కనుగొన్నారు. ఈ వ్యవహారంలో కేంద్రప్ర భుత్వ సంస్థ పాత్ర కూడా ఉందని చెబుతారా ? పిటిషనర్ ఏ విధమైన అక్రమాలకు పాల్పడ్డారో ప్రాథమిక ఆధారాలు తేల్చలేకపోయారు. రెండు నెలలుగా దర్యాప్తు చేస్తూ ప్రభుత్వాధికారులను మాత్రం ఒక్కర్ని నిందితుడిగా కనుగొనలేకపోయారు. వారి పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చలేదు. కొంతమందినే ఎంచుకొని వారిపైనే కేసులెందుకు పెడుతున్నారు. ఎందుకు ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. కుంభకోణం జరిగిందని సీఐడీ ఫిర్యాదు అందితే అందుకు బాధ్యులైన అందరిని నిందితులుగా చేర్చాల్సిన బాధ్యత మీది కాదా అని ప్రశ్నల వర్షం కురిపించారు.
నోటీసులిచ్చాం..