ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Chinthamani Drama: ఒక క్యారెక్టర్ బాగోలేకపోతే.. నాటకాన్ని ఎలా నిషేధిస్తారు: హైకోర్టు

By

Published : Feb 2, 2022, 12:28 PM IST

Updated : Feb 3, 2022, 5:03 AM IST

AP high court on Chinthamani drama: చింతామణి నాటక ప్రదర్శనను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించడంపై హైకోర్టు మండిపడింది. వందేళ్ల చరిత్ర ఉన్న నాటకంపై రాత్రికి రాత్రి ఎలా నిషేధం విధిస్తారని నిలదీసింది. సుబ్బిశెట్టి పాత్రపై అభ్యంతరం ఉంటే మొత్తం నాటకాన్ని నిలువరించడం సరికాదంది. ఇలా నిషేధించుకుంటూ పోతే ఏ నాటకాలూ, సినిమాలూ మిగలవని వ్యాఖ్యానించింది.

hc on Chintamani natakam
hc on Chintamani natakam

AP high court on Chinthamani drama: చింతామణి నాటకం నిషేధంపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఒక పాత్ర బాగోకపోతే మొత్తం నాటకాన్ని ఎలా నిషేధిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎవరూ నిరసన తెలపలేదని, ఉద్యమాలూ చేయలేదని ఎందుకు నిషేధించారని ప్రశ్నించింది. చింతామణి పుస్తకాన్ని నిషేధించనప్పుడు.. దాని ఆధారంగా ప్రదర్శించే నాటకాన్ని ఎలా నిషేధిస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. పుస్తకంలో పేర్కొన్న అంశాలకు భిన్నంగా అభ్యంతరకరమైన ప్రదర్శన జరుగుతుంటే ఆరోజు నాటకాన్ని అడ్డుకోవాలని, అభ్యంతరకరంగా పాత్ర పోషిస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని తెలిపింది. మొత్తం నాటకాన్నే నిషేధించడం సరికాదని తేల్చిచెప్పింది. నాటకం ప్రజలకు వినోదాన్ని పంచుతూ, వ్యభిచార దుష్పరిణామాలపై చైతన్యవంతుల్ని చేస్తుందని పేర్కొంది. ఏ వివరాల ఆధారంగా నిషేధం విధించారు, అందుకు సంబంధించిన దస్త్రాలను కోర్టు ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నాటకాన్ని నిషేధించడాన్ని సవాలు చేస్తూ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన ప్రజాహిత వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ కె.మన్మథరావు ధర్మాసనం పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడికి నోటీసులు జారీచేసింది. విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. ఇదే అంశంపై కళాకారుడు ఎ.త్రినాథ్‌ దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.గంగారావు.. వివరాలు కోర్టు ముందు ఉంచేందుకు విచారణను ఈ నెల 9కి వాయిదా వేశారు.

రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు...

చింతామణి నాటక ప్రదర్శనపై నిషేధం విధిస్తూ జనవరి 17న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎంపీ రఘురామకృష్ణరాజు పిల్‌ వేసిన విషయం తెలిసిందే. న్యాయవాది పీవీజీ ఉమేశ్‌చంద్ర వాదనలు వినిపిస్తూ.. సామాజిక సంస్కర్త కాళ్లకూరి నారాయణరావు ఈ నాటకాన్ని రచించారన్నారు. 1920 నుంచి ఎలాంటి అవరోధం లేకుండా నాటకాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు. కళాకారుల స్వేచ్ఛను హరించేలా ప్రభుత్వ నిర్ణయం ఉందని చెప్పారు. వ్యభిచారాన్ని నిర్మూలించాలనే సదుద్దేశంతో చింతామణి పుస్తకాన్ని రచించారన్నారు. సినిమాలో అభ్యంతరకర సన్నివేశాల తొలగింపునకు సెన్సార్‌ బోర్డు ఉందన్నారు. నాటకంలో సన్నివేశాల పర్యవేక్షణకు ఎలాంటి చట్ట నిబంధనలు లేవన్నారు. ఈ నేపథ్యంలో చింతామణి నాటకాన్ని నిషేధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. ప్రభుత్వ న్యాయవాది (జీపీ) సుభాష్‌ వాదనలు వినిపిస్తూ.. పుస్తకంలో పేర్కొన్న విషయాలను వక్రీకరించి ఓ సామాజికవర్గాన్ని కించపరిచే రీతిలో నాటకాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు. ఈ వ్యవహారంపై అందిన ఫిర్యాదుల ఆధారంగా నిషేధ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఏపీ ఆర్యవైశ్య మహాసభ తరఫు న్యాయవాది ఒ.మనోహర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. నాటకంలో ఓ పాత్ర తమ సామాజికవర్గాన్ని అవహేళన చేసేలా ఉందన్నారు. తమ వినతి మేరకే ప్రభుత్వం నిషేధ నిర్ణయం తీసుకుందన్నారు.

కళాకారుల జీవనోపాధిని దెబ్బతీస్తుంది...
జస్టిస్‌ ఎం.గంగారావు వద్ద మరో వ్యాజ్యంపై జరిగిన విచారణలో న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్‌ వాదనలు వినిపించారు. ప్రభుత్వ నిర్ణయం కళాకారుల జీవనోపాధిని దెబ్బతీసేలా ఉందన్నారు. ఎలాంటి ఆటంకం లేకుండా ఎప్పటి నుంచో ప్రదర్శిస్తున్న చింతామణి నాటకంపై నిషేధ ఉత్తర్వులు తగదన్నారు. పలువురు కళాకారులు నాటక ప్రదర్శనకు ఈ ఏడాది జూన్‌ వరకు తేదీలు ఖరారు చేసుకున్నారన్నారు. ధర్మాసనం ముందు పిల్‌ విచారణ జరుపుతున్నప్పటీకీ.. కళాకారులు జీవనోపాధి వ్యవహారం ముడిపడి ఉన్న నేపథ్యంలో వ్యాజ్యంపై విచారణ జరిపి తగిన ఉత్తర్వులివ్వాలని కోరారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ‘దశాబ్దాలుగా చింతామణి నాటక ప్రదర్శన జరుగుతోంది. ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తున్న నాటకం అది. కళాకారులకు, రచయితలకు అనుకూలంగా సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులున్నాయి. వాటికేం సమాధానం చెబుతారు? నాటకంలో సన్నివేశాలపై అభ్యంతరకరమైనవి ఉంటే వాటిని నిలువరించండి. అంతేతప్ప మొత్తం నాటకాన్నే నిషేధించడమేంటి? నాటకాల్లో ప్రదర్శనల కంటే సినిమా పాటల్లో అశ్లీలత కనిపించడం లేదా?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజల్లో విప్లవం, చైతన్యం తీసుకొస్తున్నాయనే కారణంతో వివిధ దేశాల్లో గ్రంథాలు, పుస్తకాలు, శ్లోకాలను నిషేధించారన్నారు. అదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం చింతామణిని నిషేధించిందా అని ప్రశ్నించారు. జీసీ సుభాష్‌ వాదనలు వినిపిస్తూ.. నాటకాన్ని నిషేధించాలని కోరుతూ పలు వినతులు వచ్చాయన్నారు. పుస్తకంలో పేర్కొన్నదాన్ని వక్రీకరిస్తూ ఓ సామాజికవర్గం మనోభావాలు దెబ్బతీసేలా సుబ్బిశెట్టి పాత్రను చాలా అసభ్యకరంగా ప్రదర్శిస్తున్నారని చెప్పారు.

ఇదీ చదవండి:

Missing Girl Identified: అమ్మ ప్రేమ కోసం.. ఆ బాలిక ఏం చేసిందంటే..!

Last Updated : Feb 3, 2022, 5:03 AM IST

ABOUT THE AUTHOR

...view details