ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

టారిఫ్​లను సమీక్షించే అధికారం ఈఆర్​సీకి లేదు: పవన విద్యుతుత్పత్తి సంస్థలు

HC on PPA Agreements: విద్యుత్ యూనిట్ టారిఫ్ ధరలను పునఃసమీక్షించే అధికారం ఏపీ విద్యుత్ నియంత్రణ మండలికి లేదని పవన విద్యుతుత్పత్తి సంస్థల తరపున న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించారు. పీపీఏలోని నిబంధనలు టారిఫ్‌ ధరలను తగ్గించేందుకు వీలులేకపోవడంతో.. ఆ పనిని ఈఆర్​సీ ద్వారా చేయాలని విద్యుత్ పంపిణీ సంస్థలు చూస్తున్నాయని పేర్కొన్నారు. ఈఆర్​సీ నిర్ణయించిన ధరను అదే సంస్థ సవరించలేదని తెలిపారు.

HC on PPA Agreements
HC on PPA Agreements

By

Published : Feb 4, 2022, 5:20 AM IST

HC on PPA Agreements: చట్టబద్ధంగా జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లోని యూనిట్ టారిఫ్ ధరలను సమీక్షించి, సవరించే అధికారం ఏపీ విద్యుత్ నియంత్రణ మండలికి లేదని పవన విద్యుతుత్పత్తి సంస్థల తరపున న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించారు. పీపీఏలోని నిబంధనలు టారిఫ్‌ ధరలను తగ్గించేందుకు వీలులేకపోవడంతో.. ఆ పనిని ఈఆర్సీ ద్వారా చేయాలని విద్యుత్ పంపిణీ సంస్థలు చూస్తున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఈఆర్​సీ వద్ద పిటిషన్ దాఖలు చేసి విద్యుత్ టారిఫ్ ధరలను సవరించాలని డిస్కంలు కోరుతున్నాయన్నారు. మొదట యూనిట్ ధరలను ఈఆర్​సీ నిర్ణయించిందని, ఆ తర్వాతే ఒప్పందాలు జరిగాయన్నారు. ఈఆర్​సీ నిర్ణయించిన ధరను అదే సంస్థ సవరించలేదన్నారు. నిర్దిష్ట సమయం మించిపోయాక ఈఆర్సీ సమీక్షించజాలదన్నారు. ఈఆర్​సీ వద్ద డిస్కంలు వేసిన పిటిషన్‌ చెల్లుబాటు కాదన్నారు. యూనిట్ టారిఫ్ ధరలను తగ్గించేందుకు జరుగుతున్న ప్రయత్నం వెనుక కారణం కేవలం ఏపీలో ప్రభుత్వ పాలన మారడమేనన్నారు. ప్రభుత్వాలు మారినంతమాత్రాన పూర్వ ప్రభుత్వ విధాన నిర్ణయాలను పక్కనపెట్టడానికి వీల్లేదన్నారు. సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని తెలిపారు.

విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు మరణ శానసం లాంటిదే...

గత ప్రభుత్వ హయాంలో పీపీఏ ఒప్పందాలు జరిగాయని... వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి విద్యుత్ సంస్థలను ఏర్పాటు చేసి ఉత్పత్తి చేశామని, కొన్నేళ్ల పాటు పీపీఏలో పేర్కొన్న ధరలు చెల్లించారని సంస్థలు పేర్కొన్నాయి. ఇప్పుడు యూనిట్ టారిఫ్‌ మార్చాలని ప్రభుత్వం, డిస్కులు కోరడం ఏంటని ప్రశ్నించాయి. వ్యవహార శైలి ఇలా ఉంటే.. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు నిధులు సమకూర్చేవారి మనసుల్లో అనుమానాలు తలెత్తుతాయని పేర్కొన్నాయి. ఇలాంటి నిర్ణయాలు విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు మరణ శానసం లాంటిదేనని వాదించాయి. భారీగా రుణం తీసుకొచ్చి సంస్థలను ఏర్పాటు చేశామని..., ప్రభుత్వం తమకు ఇవ్వాల్సిన బకాయిలను చెల్లించడంలేదని వివరించాయి. తెచ్చిన రుణాలు తీర్చలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపాయి. ఒప్పందాలకు ప్రభుత్వాలు గౌరవించాలని... యూనిటు ఫలానా ధర ఇస్తామని ప్రభుత్వం, డిస్కంలు హామీ ఇచ్చి ఒప్పందం చేసుకున్నాయని తెలిపారు. ఆ హామీ నుంచి వెనక్కితగ్గడానికి వీల్లేదని విద్యుత్ ఉత్పత్తి సంస్థలు స్పష్టం చేశాయి.

డిస్కంల తరఫు అడ్వొకేట్ వాదనలు...

డిస్కంల తరఫున అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ .. పీపీఏలో పేర్కొన్న ధరలను నియంత్రించే అధికారంఈఆర్​సీకి ఉందన్నారు. ఈఆర్​సీకి విచారణాధికార పరిధి ఉందని, అన్ని ప్రశ్నలకు అక్కడ సమాధానం దొరుకుతుందని ప్రాథమికంగా భావించిన హైకోర్టు సింగిల్ జడ్జి ఈ వ్యవహారాన్ని ఈఆర్​సీకి వదిలేశారన్నారు. పూర్తిస్థాయి వాదనలు వినేందుకు సమయం లేకపోవడంతో విచారణను ఈనెల 7కు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత కుమార్ మిశ్ర, జస్టిస్ జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలిచ్చింది. గత ప్రభుత్వ హయాంలో చేసుకున్న పీపీఏ యూనిట్ టారిఫ్ ధరలను ఏపీ ఈఆర్​సీ సమీక్షించేందుకు వీలు కల్పిస్తూ 2019లో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశాయి. తాత్కాలిక చర్యల్లో భాగంగా సోలార్ యూనిట్‌కు 2 రూపాయల 44 పైసలు, పవన విద్యుత్ యూనిట్కు 2 రూపాయల 43 పైసల చొప్పున బకాయిలు చెల్లించాలని సింగిల్ జడ్జి ఆదేశించడంపై అభ్యంతరం తెలిపాయి. మరోవైపు యూనిట్ టారిఫ్‌ను సవరించాలని కోరుతూ ఈఆర్సీ వద్ద డిస్కంలు పిటిషన్ దాఖలు చేయడాన్ని సవాలు చేస్తూ విద్యుదుత్పత్తి సంస్థలు హైకోర్టులో వ్యాజ్యాలు వేశాయి. ఈ వ్యవహారంపై విద్యుత్ ఉత్పత్తి సంస్థల తరపు సీనియర్ న్యాయవాదులు సంజయ్‌సేన్, బసవ ప్రభుపాటిల్, న్యాయవాదులు శ్రీ వెంకటేశ్, ముఖర్జీ, చల్లా గుణరంజన్, అనికేత్ తదితరులు వాదనలు వినిపించారు.

ఇదీ చదవండి:Chinthamani Drama: ఒక క్యారెక్టర్ బాగోలేకపోతే.. నాటకాన్ని ఎలా నిషేధిస్తారు: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details