రాజధానికి సంబంధించిన అనుబంధ పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. రాజధాని అంశానికి సంబంధించి దాఖలైన ప్రధాన పిటిషన్లపై నవంబర్ 2 నుంచి విచారణ చేస్తామని ధర్మాసనం తెలిపింది. ప్రధాన పిటిషన్లను అంశాల వారీగా వర్గీకరించి రోజువారీ విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది. రెండు వారాల్లోగా ఈ పిటిషన్లపై విచారణ జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రాజధాని ప్రధాన పిటిషన్లపై దసరా తర్వాత విచారణ - hc on amaravathi issue latest updates
13:11 October 12
రాజధానికి సంబంధించిన అనుబంధ పిటిషన్లపై విచారణ పూర్తి
దసరా తర్వాత జరిగే ఈ వాదనలు 15 రోజులపాటు కొనసాగనున్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఇరువర్గాలకు చెరో వారం చొప్పున సమయం కోర్టు ఇచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. పిటిషనర్లు భౌతికంగా కూడా హాజరై వాదనలు వినిపించవచ్చని... కోర్టుకు రాలేనివారు ఆన్లైన్ ద్వారా వాదనలు చేసే అవకాశం ఉందని న్యాయవాది రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు.
విశాఖ గెస్ట్‌హౌస్ నిర్మాణం అంశంపై తీర్పు రిజర్వ్
విశాఖలో గెస్ట్‌హౌస్ నిర్మాణానికి సంబంధించి పిటిషన్ విచారణలో ఇరువర్గాలు... హైకోర్టుకు తమ వాదనలు వినిపించాయి. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ... విశాఖ అతిథి గృహం వివరాలు కౌంటర్‌లో ప్రభుత్వం దాఖలు చేయలేదని కోర్టుకు తెలిపారు. కాకినాడ, తిరుపతిలో నిర్మించే అతిథిగృహాల వివరాలు అందజేసిన ప్రభుత్వం... విశాఖ గెస్ట్‌హౌస్ వివరాలు మాత్రం సమర్పించలేదని అన్నారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం.. విశాఖలో నిర్మించే గెస్ట్‌హౌస్ నమూనాలు ఇంకా పూర్తి కాలేదని హైకోర్టుకు తెలిపింది. టెండర్లు పూర్తయ్యాకే పూర్తి వివరాలు చెప్పగలమని స్పష్టం చేసింది. ఈ అంశంపై ఇరు వర్గాల వాదనలు విన్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం.. విశాఖ గెస్ట్ హౌస్ నిర్మాణ అంశంపై తీర్పు రిజర్వులో ఉంచింది.
ఇదీ చదవండి:కొద్దిగంటల్లో తీవ్రంగా మారనున్న వాయుగుండం