ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో తమను స్థానిక అభ్యర్థులుగా పరిగణించాలని కోరుతూ.. పలువురు దాఖలు చేసిన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ప్రవీణ్ కుమార్, జస్టిస్ డి.రమేష్తో కూడిన ధర్మాసనం.. ఈ మేరకు తీర్పు ఇచ్చింది. రాష్ట్రపతి ఉత్తర్వులు 4.1 నిబంధన ప్రకారం.. వరుసగా నాలుగేళ్లు స్థానికంగా చదివి, ఇంటర్ లేదా ప్లస్ టూ తో ఆ నాలుగేళ్లు ముగించాల్సిందేనని తెలిపింది. ఇంటర్ లేదా ప్లస్ టూ తరగతులు అర్హత పరీక్షలు కాగా.. పిటిషనర్లు వాటిని ఇతర రాష్ట్రాల్లో చదివారని గుర్తు చేసింది.
స్థానిక అభ్యర్థిగా పరిగణించి, వైద్య విద్యలో సీటు కేటాయింపునకు ఆదేశించాలని కోరుతూ.. కోటేశ్వరరావు అనే అభ్యర్థి హైకోర్టును ఆశ్రయించారు. 3వ తరగతి నుంచి 10 వరకు గుంటూరు జిల్లాలో చదివానని.. 11,12 తరగతులు మైసూర్లో అభ్యసించానని పేర్కొన్నారు. ఇదే తరహాలో మరికొందరు వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. చాలా ఏళ్లు రాష్ట్రంలోనే విద్యను అభ్యసించామని.. తల్లిదండ్రుల ఉద్యోగరీత్యా కేవలం రెండేళ్లు మాత్రమే పొరుగు రాష్ట్రంలో చదివామని అభ్యర్థులు స్పష్టం చేశారు. వీటిపై విచారణ జరిపిన ధర్మాసనం.. రాష్ట్రపతి ఉత్తర్వుల నిబంధనల పరిధిలోకి పిటిషనర్లు రారని స్పష్టం చేసింది.