దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్భంగా పేలుడు కోసం హైదరాబాద్‌లో అరెస్టయిన సోదరులిద్దరికీ హవాలా ద్వారా డబ్బులు ముట్టినట్లు తెలుస్తోంది. బాంబు తయారీకి ఈ సొమ్మునే వాడుకున్నారు. జూన్ 17న బిహార్‌లోని దర్భంగా రైల్వేస్టేషన్లో జరిగిన బాంబు పేలుడుపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరితో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన నలుగుర్ని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఎన్‌ఐఏ దర్యాప్తులో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఖైరాన్‌కు చెందిన నాసిర్‌ఖాన్‌కు అదే గ్రామానికి చెందిన ఇక్బాల్‌ఖాన దూరపు బంధువు. తొమ్మిదో దశకంలో పాకిస్థాన్ వెళ్లిన ఇక్బాల్‌ఖాన దుస్తుల వ్యాపారం చేసుకుంటూ భారతదేశంలో ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నాడు. ఇక్కడ దుస్తుల వ్యాపారంలో ఇబ్బంది పడుతున్న నాసిర్‌ఖాన్‌కు ఇక్బాల్‌ఖాన సలహా తీసుకోమని పలువురు సూచించారు. ఈ క్రమంలోనే పదేళ్ల క్రితం నాసిర్‌ఖాన్ పాకిస్థాన్ వెళ్లి ఆయన్ను కలిశాడు. అక్కడ ఉన్నప్పుడే ఉగ్రవాదానికి బీజం పడింది. స్థానికంగా దొరికే రసాయనాలతో బాంబుల తయరీపై శిక్షణ తీసుకున్న నాసిర్‌ఖాన్ భారత్‌కు తిరిగి వచ్చి తన సోదరుడైన ఇమ్రాన్‌మాలిక్‌తో కలిసి హైదరాబాద్ చేరుకున్నాడు. ఇక్కడే దుస్తుల వ్యాపారం చేసుకుంటూ స్లీపర్‌సెల్ నిర్వహిస్తున్నాడు.