హైదరాబాద్ మహా నగరంలో కొందరు కేటుగాళ్లు బ్యాంక్ ఏటీఎం(ATM) కేంద్రాల్లో డబ్బులు డిపాజిట్ చేసే యంత్రాల నుంచి సొమ్ము కొల్లగొడుతున్నారు. ఇటీవల ఎస్‌బీఐ(SBI) బ్యాంకుకు సంబంధించిన ఏటీఎం కేంద్రాలనే లక్ష్యంగా చేసుకుని నగదు కాజేస్తున్నారు. జూన్ 19న నల్లకుంట పోలీసులకు ఓ ఫిర్యాదు అందింది. విద్యానగర్‌లోని ఏటీఎం సెంటర్లోని డిపాజిట్ యంత్రం నుంచి రూ.50 వేలు మాయం అయ్యాయని ఎస్‌బీఐ అధికారులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా జూన్ 18న ఘటన జరిగినట్లు గుర్తించారు. ఉదయం 9 గంటల సమయంలో వచ్చిన ఇద్దరూ.. డిపాజిట్ యంత్రం వద్ద చాలా సేపు ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసులో 5 సార్లు రూ.50వేలు మాయం అయినట్లు గుర్తించారు.
దేశవ్యాప్తంగా మోసాలు
హరియాణా నుంచి వచ్చిన ఈ ఇద్దరూ.. అదే రోజు సైదాబాద్‌లో ఓ ఆటో మాట్లాడుకున్నారు. అక్కడ ఏటీఎం కేంద్రంలో డిపాజిట్ యంత్రం నుంచి రూ.1.24లక్షలు తస్కరించారు. అక్కడి నుంచి నాగోల్‌లోని మరో యంత్రంలో ప్రయత్నించగా అక్కడ డబ్బు రాకపోవడంతో ఉప్పల్ మీదుగా నల్లకుంట చేరుకున్నారు. విద్యానగర్ ఎస్‌బీఐ ఏటీఎంలో రూ.50వేలు కాజేశారు. ఆటో డ్రైవర్‌ను ప్రశ్నించగా వారు హరియాణా నుంచి వచ్చినట్లు చెప్పారని....ఆటోకు రూ.600 కిరాయి ఇచ్చి వెళ్లారని తెలిపారు. గత నెలలో చిక్కడపల్లి వీఎస్టీ వద్ద ఉన్న ఏటీఎం సెంటర్ నుంచి విడతల వారీగా 3లక్షలు మాయం అయ్యాయని....బ్రాంచి మేనేజర్ హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుమలగిరి పరిధిలోని మరో ఏటీఎం సెంటర్‌లో ఇదే తరహా ఘటన జరిగింది. కానీ దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. కేవలం హైదరాబాద్‌లోనే కాదు దేశవ్యాప్తంగా హరియాణా ముఠా ఈ తరహా నేరాలకు పాల్పడుతోంది.
అసలు అంత ధైర్యంగా నగదు ఎలా తీస్తున్నారు?... ఖాతాలో డబ్బు ఎందుకు కట్ అవ్వట్లేదు అనే కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి.