72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగం అమలు ప్రారంభమై 71 సంవత్సరాలు పూర్తి చేసుకుని.. 72వ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సమయంలో.. రాజ్యాంగ పీఠికలో ప్రస్తావించిన ప్రతి ఒక్క మాటా ఎంత విలువైందో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని సూచించారు. సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామిక గణతంత్ర దేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయంతో పాటు, భావపరమైన, వ్యక్తీకరణ పరమైన, మతపరమైన స్వాతంత్య్రాన్ని రాజ్యాంగం ప్రసాదించిందని చెప్పారు. పౌరులందరికీ సమాన హోదాను, అవకాశాలను పెంపొందించేలా రాజ్యాంగం దిశానిర్దేశం చేసిందని వివరించారు. అన్ని రాజ్యాంగ సూత్రాలకు ప్రతిరూపంగానే రాష్ట్రంలో 20 నెలలుగా పరిపాలన సాగుతోందని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు.
ప్రపంచానికే తలమానికం...
రాష్ట్ర ప్రజలందరికీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలతో ప్రపంచానికే తలమానికమైన గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చిన రాజ్యాంగ నిర్మాతలను స్మరించుకుంటూ... వారి బాటలో నడుస్తూ, ఆ మహనీయులకు ఘన నివాళులు అర్పిద్దామని పిలుపునిచ్చారు. రాజ్యాంగ పెద్దలు ఇచ్చిన హక్కులు కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
"ప్రాథమిక హక్కులను కాలరాయడం రాజ్యాంగద్రోహం. చట్టాలకు తూట్లు పొడుస్తూ, అడుగడుగునా కోర్టు ధిక్కరణలు, పత్రికా స్వేచ్ఛ హరించడం గర్హనీయం. రాజ్యాంగ వ్యవస్థల విచ్ఛిన్నానికి పాల్పడటం హేయం. నాకెందుకులే అనే నిర్లిప్తత సమాజానికే కీడు. ఉదాసీనత ఘన వారసత్వ సంపదకే చేటు. ప్రశ్నించే హక్కు మన సొంతం. వీటిని నిలబెట్టుకోవడం ప్రతి భారతీయుడి విద్యుక్తధర్మం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ, రాజ్యాంగాన్ని పరిరక్షించుకుని, వ్యవస్థలను విచ్ఛిన్నం చేసేవాళ్ల దుశ్చర్యలను అడ్డుకుందాం. రాజ్యాంగ పెద్దల ఆశలను, ప్రజల ఆకాంక్షలను నెరవేరుద్దాం. ఆంధ్రప్రదేశ్ అప్రతిష్టపాలు కాకుండా కాపాడుకుందాం, భారతదేశం గౌరవం ఇనుమడింప చేద్దాం.-చంద్రబాబు, తెదేపా అధినేత