క్షణక్షణం ఉత్కంఠ.. నిందితుడికి ఏ శిక్ష విధిస్తారో అని అందరిలోనూ ఒకటే చర్ఛ. అందరూ అనుకున్నట్లుగానే కోర్టు మృగాడికి మరణదండన విధిస్తూ తీర్పు వెలువరించింది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన చిన్నారిపై హత్యాచారం కేసులో నిందితుడికి ఉరిశిక్ష, రూ.3వేల జరిమానా విధిస్తూ స్థానిక మొదటి అదనపు జిల్లా కోర్టు, పోక్సో కోర్టు న్యాయమూర్తి ఎం.వెంకటహరినాథ్ తీర్పు ఇచ్చారు. న్యాయమూర్తి తీర్పు వెలువరించే చివరి నిమిషంలో. ‘నీపై నేరం రుజువయింది.. ఉరి.. జీవితఖైదు.. జరిమానా పడుతుంది.. ఏం చెప్పాలనుకుంటున్నావు.. ’ అని రఫీని అడిగారు. ‘నేనేం నేరం చెయ్యలేదు.. నా తల్లిదండ్రులు వృద్ధులు.. వారి పోషణ నాపైనే ఆధారపడింది’ అని రఫీ వేడుకున్నాడు. భోజనం అనంతరం న్యాయమూర్తి ఉరిశిక్షవిధిస్తూ మొత్తం 72పేజీలతో తీర్పును ప్రకటించారు. తీర్పుపై 30రోజుల్లో హైకోర్టుకు అప్పీల్‌కు వెళ్లవచ్చని పేర్కొన్నారు. అనంతరం న్యాయమూర్తిని న్యాయవాదులు, పోలీసులు అభినందించారు. పోక్సో కేసులో తొలి మరణదండన తీర్పు చిత్తూరు కోర్టులో వెలువరించడం గమనార్హం.
ఏ రోజున ఏం జరిగింది..?
- 2019 7వ తేదీ రాత్రి నవంబర్ చిన్నారిపై రఫీ ఘాతుకం
- 8 ఉదయం కల్యాణమండపం వెనక విగతజీవిగా బాలిక
- 10న రాత్రి నిందితుడి ఊహా చిత్రం విడుదల
- జిల్లా ఎస్పీ, మదనపల్లె డీఎస్పీ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాల గాలింపు.
- పాత నేరస్థుల విచారణ
- కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం జగన్ ఆదేశం
- 11 న శవపరీక్ష నివేదికలో విస్తుపోయే నిజాలు
- 12న నిందితుడి కాల్‌డేటా సేకరణ
- 16న నిందితుడు రఫీ పట్టివేత
- 18 బహిరంగంగా ఉరిశిక్ష వేయాలని మదనపల్లెలో భారీ నిరసన
- 2020 ఫిబ్రవరి 17 ముగిసిన విచారణ, తీర్పు వాయిదా
- 24 న ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడి
కేసు నేపథ్యం ఇది..
చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం అంగళ్లు పంచాయతీ గుట్టపాళెం గ్రామానికి చెందిన దంపతులు గతేడాది నవంబరు 7న కుమార్తెలతో కలసి కురబలకోట మండలం చేనేతనగర్‌లోని ఓ కల్యాణ మండపంలో వివాహ శుభకార్యానికి హాజరయ్యారు. తోటి పిల్లలతో ఆడుకుంటున్న చిన్నారిపై నిందితుడు మహ్మద్ రఫీ అలియాస్ గిడ్డు (25) కన్నుపడింది. ఈక్రమంలో చిన్నారి ఫొటోలు తీస్తూ దగ్గరయ్యాడు. రాత్రి 9.45గంటలకు బాలిక మూత్రశాలకు వెళ్లింది. వెనుకనే నిందితుడు కూడా మూత్రశాల గదిలోకి వెళ్లి.. గడియ వేశాడు. లోపల శబ్దం ఎవరికీ వినపకుండా ఉండటం కోసం కొళాయిని తిప్పాడు. ముఖాన్ని చేతితో మూసి.. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈక్రమంలోనే చిన్నారిని బకెట్‌లోని నీటిలో ముంచి.. హత్య చేశాడు. అనంతరం గడియ తీసి.. కల్యాణ మండపం వెనుక వైపు చిన్నారి మృతదేహాన్ని విసిరేసి వెళ్లాడు. ఈ తరుణంలో కల్యాణ మండపంలో ఐస్‌క్రీమ్ పంపిణీ చేస్తున్న ప్రదేశంలో అక్కడి వారితో గొడవ పడ్డాడు. అనంతరం ద్విచక్ర వాహనంపై కురబలకోట మండలం మొలకవారిపల్లెలోని అత్తారింటికి వెళ్లాడు. ఆ రోజు రాత్రి స్నానం చేసి.. హత్య సమయంలో ధరించిన బట్టలు మార్చుకున్నాడు. చిన్నారి తల్లిదండ్రులు ఇంటికి వెళదామనుకునే సమయానికి పాప కనిపించలేదు. చుట్టుపక్కల గాలించినా ఫలితం లేదు. మరుసటిరోజు ఉదయం కల్యాణ మండపం వైనుక వైపుగా వెళ్లిన స్థానికులకు చిన్నారి మృతదేహం కనిపించింది. అనంతరం తల్లిదండ్రులు ముదివేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.