Tollywood Drugs: టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. కేసుకు సంబంధించి డిజిటల్ రికార్డుల అంశం తాజాగా చర్చనీయాంశంగా మారింది. కొందరు సినీ ప్రముఖులు మాదక ద్రవ్యాలు తీసుకున్నారని, డ్రగ్‌పెడ్లర్ కెల్విన్‌తో వాటి లావాదేవీలు నిర్వహించారన్న అభియోగాల నేపథ్యంలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ఇప్పటికే పలువురిని పిలిచి విచారించిన సంగతి తెలిసిందే. ఎక్సైజ్ శాఖ దీనికి సంబంధించి మొత్తం 12 కేసులను నమోదు చేయగా.. ఎక్సైజ్ ఎన్‌ఫోర్సుమెంట్ వాటి అభియోగ పత్రాలనూ సమర్పించి, ఈ కేసుల్లో సినీ ప్రముఖులకు సంబంధాలు లేవని తేల్చింది. ఈడీ కేసు మాత్రం ఇంకా దర్యాప్తు దశలోనే ఉంది. అయితే, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దర్యాప్తు సందర్భంగా సేకరించిన డిజిటల్ రికార్డులను ఇప్పటివరకు తమకు సమర్పించలేదని ఈడీ నాలుగు రోజుల క్రితం న్యాయస్థానం దృష్టికి తెచ్చింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని ఎంపీ రేవంత్‌రెడ్డి గతంలో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణ క్రమంలో డిజిటల్ రికార్డుల అంశం తెరపైకి వచ్చింది. తాము దర్యాప్తు చేస్తామంటూ ఈడీ ఇదివరకే కేసులో ఇంప్లీడ్ అయింది. ఈ క్రమంలో దర్యాప్తు వివరాల్ని ఈడీకి అప్పగించాలని న్యాయస్థానం ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను ఆదేశించింది. ఎఫ్‌ఐఆర్‌లు, అభియోగపత్రాలను మాత్రమే ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తమకు అప్పగించిందని, డిజిటల్ రికార్డుల్ని ఇవ్వలేదంటూ ఈడీ న్యాయస్థానం దృష్టికి తెచ్చింది. కేసుల్లో మనీలాండరింగ్ జరిగిందా? లేదా? అన్న అంశాన్ని తేల్చేందుకు ఆ రికార్డులు తప్పనిసరి అని తెలిపింది. దీంతో వాటిని ఈడీకి అప్పగించాలని న్యాయస్థానం తాజాగా ఆదేశించింది.
Tollywood Drugs: మళ్లీ తెరపైకి టాలీవుడ్ డ్రగ్స్ కేసు - ed enquiry in Tollywood Drugs
Tollywood Drugs: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకొంది. ఈ కేసుకు సంబంధించిన డిజిటల్ రికార్డులు అప్పగించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. కేసుల్లో మనీలాండరింగ్ జరిగిందా? లేదా? అన్న అంశాన్ని తేల్చేందుకు ఆ రికార్డులు తప్పనిసరి అని తెలిపింది. దీంతో వాటిని ఈడీకి అప్పగించాలని న్యాయస్థానం తాజాగా ఆదేశించింది.
ఎవరి తలరాత మార్చునో..
న్యాయస్థానం ఆదేశాల నేపథ్యంలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిజిటల్ రికార్డుల్ని ఈడీకి ఇవ్వాలి ఉంటుంది. ఇందులో డ్రగ్‌పెడ్లర్ కెల్విన్ కాల్ రికార్డులు, వాట్సప్ చాటింగ్, అతడి బ్యాంకు ఖాతాల ఆన్‌లైన్ లావాదేవీల వివరాలు కీలకం కానున్నాయి. కెల్విన్ ఆఫ్రికాలాంటి దేశాల నుంచి డ్రగ్స్‌ను తీసుకొచ్చాడని, డబ్బును ఆ దేశాలకే బదిలీ చేసి ఉంటాడనే అనుమానాలు ఉన్నాయి. ఈ లావాదేవీలపై ఈడీకి ఆధారాలు చిక్కితే సినీ ప్రముఖుల మెడకు ఉచ్చు బిగుసుకునే అవకాశాలూ లేకపోలేదు. డ్రగ్స్ కొనుగోళ్లకు సంబంధించి ఆర్థిక లావాదేవీలన్నీ అనధికారికమే. ఈ నేపథ్యంలో డిజిటల్ రికార్డులు ఎవరి తలరాత మారుస్తాయోనన్న ఉత్కంఠ నెలకొంది.