15నుంచి ఒంటి పూట బడులు..తరగతులు ముగిశాక మధ్యాహ్న భోజనం - schools half day school taaza
ఈ నెల 15నుంచి రాష్ట్రంలోని పాఠశాలలకు ఒంటి పూట తరగతులు నిర్వహించనున్నారు. మధ్యాహ్న భోజనానికి విరామమంటూ లేదని.. తరగతులు ముగిసిన అనంతరం విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పెట్టనున్నారు.

యాజమాన్యాల్లోని పాఠశాలల్లో ఈనెల 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యా శాఖ కమిషనర్ చినవీరభద్రుడు ఆదేశాలు జారీ చేశారు. వేసవి నేపథ్యంలో ప్రస్తుత విద్యాసంవత్సరం ముగిసే వరకూ ఒంటిపూట బడులు కొనసాగించాలని స్పష్టంచేశారు. మధ్యాహ్నం పాఠశాల ముగించేముందు విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని తప్పనిసరిగా అందజేయాలన్నారు. ఉదయం 7.50 గంటల నుంచి 8గంటల వరకు ప్రార్థన సమయం, ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు తరగతులు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. గ్రామ పంచాయతీలు, గ్రామీణ రక్షిత మంచినీటి శాఖల సహకారంతో ప్రతి పాఠశాలలో మంచినీరు అందుబాటులో ఉంచేలా చూడడంతో పాటు వడదెబ్బను దృష్టిలో ఉంచుకుని వైద్యశాఖ సహకారంతో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను సమకూర్చుకోవాలని సూచించింది. ఏప్రిల్ నెలలో రెండో శనివారాన్ని పనిదినంగా గుర్తించాలన్నారు. పాఠశాల వార్షిక క్యాలెండర్ ప్రకారం ఒంటిపూట సమయాలను పాటించేలా జిల్లా విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఏప్రిల్ 23వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి.