ఉత్తరాంధ్ర జిల్లాలకు ‘గులాబ్’ ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. దీనికి గులాబ్ అని పేరుపెట్టారు. కళింగపట్నానికి ఈశాన్య దిశలో 380 కి.మీ, గోపాల్‌పూర్‌కు 310 దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 7 కి.మీ. వేగంతో పశ్చిమ దిశగా గులాబ్ తుపాను కదులుతోంది. ఈ రోజు సాయంత్రం గోపాల్‌పుర్-కళింగపట్నం మధ్య తీరం దాటనుందని వాతావరణశాఖ ప్రకటించింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాకు ‘ఆరెంజ్’ హెచ్చరికలను జారీ చేసింది. అందులో... ‘తుపాన్ ప్రభావం ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం ప్రాంతాలపై ఎక్కువగా ఉంటుంది. మిగిలిన కోస్తా జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. తీర ప్రాంతాల్లో గంటకు 75 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. రాగల 24 గంటల్లో ఒడిశా, ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, దక్షిణ కోస్తా జిల్లాలతోపాటు తెలంగాణ, విదర్భ, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాం. ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో సముద్రపు అలల తీవ్రత పెరిగే అవకాశముంది. తుపాను తీరాన్ని దాటే సమయంలో శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం ఆ పరిసర ప్రాంతాల్లో కచ్చా ఇళ్లు, పూరిళ్లు దెబ్బతినే ప్రమాదముంది. లోతట్టు ప్రాంతాల్లోకి సముద్ర నీరు చొచ్చుకొచ్చే ప్రమాదముంది’ అని హెచ్చరించింది.
ప్రభుత్వ ఆదేశం... కలెక్టర్ల అప్రమత్తం
తుపాను హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. 59,496 మత్స్యకార కుటుంబాలను అప్రమత్తం చేసి, లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న 86 వేల మందిని షెల్టర్లకు తరలించాల్సిందిగా సూచించారు. తీర ప్రాంతాల్లోని 76 మండల స్థాయి అత్యవసర ఆపరేషన్ కేంద్రాలు, 145 బహుళ ప్రయోజన తుపాను కేంద్రాలు, 16 ఫిఫ్ ల్యాండింగు కేంద్రాలు, 8 పర్యాటక ప్రాంతాలను రాష్ట్ర అత్యవసర ఆపరేషన్ కేంద్రానికి అనుసంధానించారు. విపత్తు నిర్వహణశాఖ అధికారులు ఏపీకి మూడు, ఒడిశాలకు 15 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను పంపించారు. మత్స్యకారులు సోమవారం వరకు చేపల వేటకు వెళ్లవద్దని విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు.
శాటిలైట్ ఫోన్లు సిద్ధం
అత్యవసర సమాచారం వినిమయానికి 16 శాటిలైట్ ఫోన్లు, వీశాట్, డీఎంఆర్ సమాచార పరికరాలను ఆయా ప్రాంతాలకు తరలించారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో గ్రామ, వార్డు సచివాలయాల్లో అత్యవసర కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను తుపాను తాకనున్న ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొవిడ్ దృష్ట్యా ఆక్సిజన్ నిల్వలతోపాటు ఇతర అత్యవసర సామగ్రిని సిద్ధం చేసుకోవాలని ఆస్పత్రులకు సూచనలు వెళ్లాయి.