విమలేశ్.. కాన్పూర్ వాసి. ఆదాయపు పన్ను శాఖలో ఆఫీసర్. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లో డ్యూటీ చేస్తున్నాడు. వయసు 35 ఏళ్లు. గతేడాది ఏప్రిల్లో కొవిడ్ బారిన పడ్డాడు. 2021 ఏప్రిల్ 19న మోతీ ఆసుపత్రిలో చేరారు. కొన్ని రోజులు ఆసుపత్రిలో ఉన్నాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు కాన్పుర్లోని తమ ఇంటికి తీసుకెళ్లారు. అప్పటి నుంచీ అతనికి ఇంట్లోనే చికిత్స అందిస్తోంది ఆ కుటుంబం.
వారిది ఉమ్మడి కుటుంబం. తల్లిదండ్రులు, అతని సోదరుల కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. విమలేశ్ భార్యతోపాటు ఉమ్మడి కుటుంబంలోని సభ్యులంతా.. అతన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేశారు. డెట్టాల్, శానిటైజర్ వంటి క్రిమిసంహారక మందులతో అతని శరీరాన్ని రోజుకు మూడుసార్లు శుభ్రం చేస్తున్నారు. ప్రతిరోజూ అతని బట్టలు వీళ్లే మారుస్తున్నారు. 24 గంటలు ఏసీ ఆన్ చేసి.. అతనికి ఏవిధమైన ఇబ్బందీ లేకుండా చూసుకుంటున్నారు.
విమలేశ్ ఆఫీసుకు వెళ్లక చాలా కాలమైంది.. ఈ విషయం కనుక్కునేందుకు ఆఫీసు నుంచి ఫోన్ చేశారు. ఆరోగ్యం బాగోలేదని.. రెస్ట్ తీసుకుంటున్నారని చెప్పారు కుటుంబ సభ్యులు. నెల రోజుల తర్వాత మళ్లీ ఫోన్ చేశారు.. ఈ సారి కూడా ఆన్సర్ రిపీట్ చేశారు.. మరోసారి ఫోన్ చేసినా.. ఆన్సర్ మారలేదు. ఇటు.. ఇంటిపక్క వారికీ, తెలిసిన వారికీ విమలేశ్ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడని చెప్తున్నారు. స్థానికులు వచ్చి.. విమలేశ్ను చూసి.. కుటుంబ సభ్యులను పరామర్శించి వెళ్తున్నారు.
ఈ ఫోన్లు.. పరామర్శలతో.. చూస్తుండగానే ఏడాదిపైనే కాలం గడిచిపోయింది. చివరకు.. ఏడాదిన్నర తర్వాత.. తాజాగా నాలుగు రోజుల క్రితం ఆఫీస్ నుంచి మళ్లీ ఫోన్ చేశారు. ఇప్పుడు కూడా అదే మాట చెప్పారు. దీంతో.. అక్కడ ఏం జరుగుతోంది? అసలు విమలేశ్ ఉన్నాడా లేడా? కుటుంబ సభ్యులు ఏమైనా అబద్ధం చెబుతున్నారా? అనేది తెలుసుకొని రావాలంటూ.. ఆఫీస్ నుంచి ఓ బృందాన్ని పంపించారు. బృంద సభ్యులు.. విమలేశ్ ఇంటికి వెళ్లి తలుపు తట్టారు. కుటుంబ సభ్యులు డోర్ తెరిచారు. "విమలేశ్ ఎక్కడ?" అని అడిన వారికి.. "అదిగో అక్కడ" అని చూపించారు. వాళ్లు వెళ్లి చూశారు.. నిజంగానే విమలేశ్ అక్కడ ఉన్నాడు. కానీ.. ప్రాణాలతో కాదు..! అవును అతను చనిపోయాడు.. ఇప్పుడు కాదు.. నిన్నామొన్నా కానేకాదు.. ఎప్పుడో మరణించాడు. అంటే.. వీళ్లు ఇంతకాలం ట్రీట్మెంట్ చేస్తున్నదీ.... "యస్.. శవానికి!"