తెలంగాణలోని ప్రైవేటు టీచర్లు, సిబ్బందికి ఆర్థిక సాయం పంపిణీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఈ మేరకు విద్యాసంస్థల నుంచి వివరాలను ఆన్‌లైన్‌లో తీసుకోనుంది. schooledu.telangana.gov.in వెబ్సైట్లో ప్రధానోపాధ్యాయుల ద్వారా వివరాల నమోదుకు అవకాశం కల్పించిన ప్రభుత్వం.. ఉపాధ్యాయులు, సిబ్బంది బ్యాంకు ఖాతాలు, ఆధార్ వివరాలు తప్పనిసరి చేసింది.
ఈ వివరాలను ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, ఇతర అధికారుల ద్వారా డీఈవోలు తనిఖీ చేయించనున్నారు. అనంతరం ధ్రువీకరించుకున్న వివరాలను కలెక్టర్ల ద్వారా విద్యాశాఖకు పంపనున్నారు. రేపటి నుంచి ఈ నెల 15 వరకు పాఠశాలల నుంచి వివరాల సేకరణ ప్రక్రియ సాగనుంది. 16 నుంచి 19 వరకు వివరాల తనిఖీ, క్రోడీకరణ జరగనుంది. ఈ నెల 20 నుంచి 24 వరకు బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేయనుండగా.. 21 నుంచి 25వ తేదీ వరకు బియ్యం పంపిణీ చేయనున్నారు.