రాష్ట్రంలో గ్రూప్-1 ప్రధాన పరీక్షలు మొదలయ్యాయి. అభ్యర్థులు సోమవారం తెలుగు పరీక్ష రాశారు. 150 మార్కులకు నిర్వహించిన పరీక్షలో తెలుగు భాషాభివృద్ధి, విద్యార్థులపై చదువుల ఒత్తిడి, యువత నైతిక విలువలు-ఆవశ్యకత, మహిళలపై వివక్ష వంటి అంశాలపై వ్యాసరూప ప్రశ్నలు వచ్చాయి. వ్యవసాయ విస్తీర్ణం తగ్గిపోతుండటంపై ఇద్దరు విద్యార్థుల మధ్య సంభాషణ, మధ్యాహ్న భోజన పథకం అమలుతీరును జిల్లా విద్యాశాఖ అధికారికి నివేదించడం, మానవ చర్యల వల్ల పక్షి, జంతుజాతులు అంతరిస్తుండటం, ఊళ్లో సౌకర్యాలు తక్కువని పేర్కొంటూ స్థానికవాసిగా ప్రభుత్వానికి లేఖ రాయాలని, ఉపాధ్యాయుడికి పురస్కారం లభిస్తే.. అభినందిస్తూ పాఠశాల తరఫున లేఖ రాయాలని అడిగారు. యూపీఎస్సీ సివిల్స్ ఆప్షన్‌గా నిర్వహించే తెలుగు పరీక్ష సరళిలోనే ఇక్కడా ప్రశ్నలు వచ్చాయని అభ్యర్థులు పేర్కొన్నారు.
తారుమారైన జవాబు పత్రాలు
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం శ్రీవెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్షకు హాజరైన 50 మంది అభ్యర్థుల జవాబు పత్రాల్లో పేర్లు, కేంద్రం మారిపోయాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన అభ్యర్థుల పత్రాలు ఇక్కడకు వచ్చాయి. ఇక్కడికి రావాల్సినవి అక్కడికి వెళ్లిపోయాయి. దాంతో అభ్యర్థుల వివరాల్ని బఫర్ బార్‌కోడ్ షీట్లలో నమోదు చేసి ప్రత్యేకంగా వారి సంతకాలతో కూడిన షీటు జతచేసి పరీక్ష రాయించారు. ఈసారి ప్రశ్నపత్రాల్ని ట్యాబ్‌ల ద్వారా అభ్యర్థులకు అందించారు. పరీక్ష సమయం మొదలవగానే అందులో ప్రశ్నపత్రం కనిపిస్తుంది. సమయం ముగిశాక దానంతట అదే వెళ్లిపోతుంది.