ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ధర లేక పేరుకుపోతున్న సెనగ నిల్వలు - ధరలు లేక గోదాముల్లో సెనగ పంట తాజా వార్తలు

రాష్ట్రంలో సెనగ పంటకు గిరాకీ లేక రైతులు గోదాముల్లో నిల్వచేస్తున్నారు. నాఫెడ్, మార్క్​ఫెడ్​లు కొంత మేర కొంటున్నా... నిల్వలు పెరుగుతున్నాయి. సెనగను ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా వినియోగిస్తారు. కాని ఇప్పుడు వారు కూడా మొగ్గుచూపకపోవడం వల్ల గోదాలముల్లోనే సరకు పేరుకుపోతుంది. సరైన ధర లేక రైతులు గోదాముల్లోనే ఉంచేస్తున్నారు. దీంతో గోదాముల అద్దెలతో పాటు బ్యాంకు రుణాలు పెరుగుతున్నాయంటూ రైతులు చెబుతున్నారు.

groundnut price fell down and farmers are storing more and more in godowns
దిక్కుతోచని స్థితిలో రైతులు

By

Published : Jun 15, 2020, 8:16 AM IST

రాష్ట్రంలో సెనగ నిల్వలు పేరుకుపోతున్నాయి. ఏటికేడాది కొత్త ఉత్పత్తి వస్తున్నా.. అందులో కొంత మేర మాత్రమే నాఫెడ్‌, మార్క్‌ఫెడ్‌ కొంటోంది. మిగిలిన సరకును శీతల గోదాముల్లోకి తరలించాల్సి వస్తోంది. ఇలా కొత్త, పాత సెనగ నిల్వలు కలిపి సుమారు 42 లక్షల క్వింటాళ్ల వరకుంటాయని అంచనా. రోజులు గడిచే కొద్దీ గోదాముల అద్దెలతోపాటు బ్యాంకు రుణాలపై వడ్డీలు పెరుగుతున్నాయని రైతులు వాపోతున్నారు. రాష్ట్రంలో సెనగ ఉత్పత్తి ఏడాదికి 48 లక్షల క్వింటాళ్లు. వినియోగం పది లక్షల క్వింటాళ్లలోపే ఉంటుంది. ఇందులో విత్తనానికి 6 లక్షల క్వింటాళ్లు అవసరం. లాక్‌డౌన్‌ సమయంలో రేషన్‌ దుకాణాల నుంచి 2దఫాలుగా కార్డుకు కిలో చొప్పున ఇచ్చారు. మొత్తంగా ఎక్కువగా ఎగుమతులపైనే ఆధారపడాల్సి ఉంటుంది. ధర లేక, ఎక్కువ వినియోగమయ్యే ఉత్తరాది రాష్ట్రాల నుంచి గిరాకీ లేకపోవడంతో నిల్వలు పేరుకుపోతున్నాయి. పలువురు రైతులు అయిదు, పదెకరాలకుపైనే సెనగ వేశారు. ఎకరాకు 5 క్వింటాళ్ల చొప్పున చూసినా పదెకరాలకు 50 క్వింటాళ్ల దిగుబడి లభిస్తుంది.

* ఒక్కో రైతు నుంచి గరిష్ఠంగా 30 క్వింటాళ్లే తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మిగిలిన పంటను బయట తక్కువ ధరకు అమ్ముకోలేక గోదాముల్లోకి చేరుస్తున్నారు.

* రెండు మూడేళ్లుగా సెనగకు ధర లేక రైతులు గోదాముల్లో నిల్వ చేశారు. కొందరికి ప్రభుత్వం క్వింటాలుకు రూ.1500 చొప్పున గరిష్ఠంగా 30 క్వింటాళ్ల వరకు సాయమందించింది. సాయమందిన వారు ధర తక్కువగా ఉందని అమ్మలేకపోయారు. ఎలాంటి సాయమందని వారు గోదాముల్లో నుంచి బయటకు తీయలేదు.

వెంటాడుతున్న ఈ-క్రాప్‌ సమస్యలు

పలువురు రైతుల్ని ఇప్పటికీ ఈ-క్రాప్‌ సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ ఏడాది 13 ఎకరాల్లో సెనగ వేస్తే, ఈ-క్రాప్‌లో నమోదు కాలేదని ప్రకాశం జిల్లా పర్చూరు రైతు డి.వెంకటసుబ్బయ్య వాపోయారు. ఫలితంగా పంటను అమ్ముకోలేకపోయానన్నారు. ఈ-క్రాప్‌లో నమోదైనా మార్క్‌ఫెడ్‌ సాఫ్ట్‌వేర్‌లో కన్పించకపోవడం వల్ల 18 క్వింటాళ్లు అమ్ముకోలేకపోతున్నానని పర్చూరు మండలం కొల్లావారిపాలెం రైతు కె.దశరథరామయ్య వివరించారు. రైతుల నుంచి ఎర్రసెనగ మినహా తెల్ల, కాబూలీ సెనగలు కొనడం లేదు. వాటిని కూడా మార్క్‌ఫెడ్‌ సేకరించాలని రైతులు కోరుతున్నారు.

ఇదీ చదవండి :

ధరల లేమితో పొగాకు రైతులు సతమతం

ABOUT THE AUTHOR

...view details