Ramanuja Sahasrabdi Utsav: సమతామూర్తి సహస్రాబ్ది వేడుకలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. వేలాది మంది రుత్వికుల యాగం, భక్తుల నమో నారాయణ మంత్ర పారాయణం.. ప్రముఖుల రాకతో తెలంగాణలోని ముచ్చింతల్లోని శ్రీరామనగరం దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ఈ వేడుకల్లో అత్యంత కీలకఘట్టమైన భారీ సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని మోదీ శనివారం లాంఛనంగా ఆవిష్కరించారు. అంతకుముందు ఉత్సవాల్లో భాగంగా అష్టాక్షరీ మహా మంత్ర జపంతో ప్రారంభించారు. త్రిదండి చినజీయర్ స్వామితోపాటు 9 మంది జీయర్ స్వాముల సమక్షంలో 5 వేల మంది రుత్వికులు, వందలాది మంది భక్తులు అష్టాక్షరీ మంత్రాన్ని జపించారు. ఈ సందర్భంగా అష్టాక్షరీ మంత్ర ప్రాశస్త్యాన్ని భక్తులకు వివరించారు.
అంతా తానై..
సాయంత్రం 4 గంటల నుంచి చినజీయర్ స్వామి పూర్తిగా అతిథుల రాక, సమతామూర్తి విగ్రహావిష్కరణ పనుల్లో నిమగ్నమయ్యారు. 5 గంటలకు ప్రధానికి స్వాగతం పలికిన చినజీయర్ స్వామి.. అంతా తానై శ్రీరామానుజచార్యుల విగ్రహాన్ని లోకార్పణం చేశారు. ప్రధాని రాక సందర్భంగా సాధారణ భక్తులెవరినీ.. పోలీసు బలగాలు సమతామూర్తి కేంద్రంలోనికి అనుమతించలేదు. విగ్రహా ఆవిష్కరణ ఓ వైపు జరుగుతుండగానే యాగశాలలో రుత్వికులు యథాతథంగా లక్ష్మీనారాయణ సహస్రకుండల మహాయజ్ఞాన్ని నిర్వహించారు.
ఉత్సవాల్లో నేడు యాగశాలలో తీవ్ర వ్యాధుల నివారణ కోసం పరమేష్టి, విఘ్నాల నివారణ కోసం వైభవేష్టి హోమాలు చేయనున్నారు. అలాగే ప్రవచన మండపంలో శ్రీరామ అష్టోత్తర నామ పూజ, వేద పండితుల ప్రవచనాలు జరగనున్నాయి. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కళ్యాణ్ సమతామూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారని నిర్వాహకులు తెలిపారు.
ఇదీచూడండి: