గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు నియామక పరీక్షలు ప్రారంభమయ్యాయి. లక్షా 26 వేల 728 ఉద్యోగాల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వగా...అన్ని పరీక్షలకు కలిపి 21 లక్షల 69 వేల 719 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 19 రకాల ఉద్యోగాలకు 14 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5 వేల 314 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షల కోసం లక్షా 22 వేల 554 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు.
నేటి నుంచే సచివాలయ పరీక్షలు...నిమిషం ఆలస్యమైనా అంతే! అత్యధికంగా విశాఖ నుంచే
10 గంటల నుంచి 12.30 వరకు కేటగిరీ-1లోని 4 రకాల ఉద్యోగాలకు పరీక్ష జరగుతోంది. పంచాయతీ సెక్రటరీ, వార్డు సెక్రటరీ, మహిళా పోలీసు, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ పోస్టులకు అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారు. కేటగిరి-1 పరీక్షకు 12 లక్షల 54 వేల 34 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా లక్షా 31 వేల 817 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
జిల్లాల వారీగా పోటీ పడుతున్న అభ్యర్థులు
జిల్లా | అభ్యర్థుల సంఖ్య |
తూర్పు గోదావరి | లక్షా 24 వేల 792 |
కర్నూలు | లక్షా 15 వేల 531 |
కృష్ణా | లక్షా 14 వేల 122 |
గుంటూరు | లక్షా 12 వేల 218 |
చిత్తూరు | లక్షా 07 వేల 715 |
అనంతపురం | లక్షా 03 వేల 209 |
పశ్చిమ గోదావరి | 86 వేల 010 |
కడప | 82 వేల 535 |
ప్రకాశం | 75వేల 897 |
నెల్లూరు | 73 వేల 793 |
శ్రీకాకుళం | 70 వేల 588 |
విజయనగరం | 58 వేల 807 |
నిమిష ఆలస్యమైతే..అంతే..
మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు కేటగిరీ-3లోని డిజిటల్ అసిస్టెంట్ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించనున్నారు. రెండు విభాగాల్లో ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు కలిపి 15.50 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షా కేంద్రాలకు ముందుగా చేరుకున్న అభ్యర్థులకు మాత్రమే లోనికి అనుమతించారు. ఈ మేరకు ఉదయం 9.30 నిమిషాల నుంచే పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఇచ్చారు.
నిరంతర పర్యవేక్షణ
పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఏర్పాటు సహా పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, వీడియో చిత్రీకరణ చేస్తున్నారు. విజయవాడ సమీపంలోని తాడేపల్లిలోని పంచాయతీ రాజ్ శాఖ ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలు, స్ట్రాంగ్ రూముల వద్ద భద్రతను కంట్రోల్ రూం నుంచి నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. అభ్యర్థులు హాల్ టికెట్ తోపాటు ఆధార్ లేదా ఏదేని ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు తెచ్చుకోవాలని కమిషనర్ ముందే సూచించారు. పరీక్షల సందర్భంగా ఏదేని సమస్య వస్తే తక్షణం పరిష్కరించేందుకు కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు.
సమాచారం కోసం అభ్యర్థులు ఫోన్ చేయాల్సిన నెంబర్లు
9191296051 |
9191296052 |
9191296053 |
9191296054 |
9191296055 |
ప్రత్యేక బస్సులు
ఒకేరోజు 15 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాస్తోన్న నేపథ్యంలో అభ్యర్థుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపింది..అయితే పలుచోట్ల రద్దీతో బస్సులు సరిపోక అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. ఈ నెల 3, 4, 6, 7, 8 తేదీల్లో మిగిలిన కేటగిరీల్లోని పరీక్షలకు నియామక పరీక్షలు కొనసాగనున్నాయి.
ఇదీ చదవండి:గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలకు ఆర్టీసీ సిద్ధం