తెలంగాణలోని నల్గొండ - వరంగల్ - ఖమ్మం, హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో తెరాస ముందంజలో ఉంది. ఇప్పటి వరకు నల్గొండ స్థానంలో ఏడు, హైదరాబాద్ స్థానంలో నాలుగు రౌండ్ల లెక్కింపు పూర్తయింది. ‘నల్గొండ’లో ఏడో రౌండ్ ముగిసేసరికి తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్నపై 27,550 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పల్లాకు 1,10,840 ఓట్లు రాగా, మల్లన్నకు 83,290 ఓట్లు వచ్చాయి. తెజస అధ్యక్షుడు కోదండరాం 70,072 ఓట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు తొలి రౌండ్ లెక్కింపు ప్రక్రియను ప్రారంభించగా, శుక్రవారం ఉదయం 6.30గంటకు ఏడు రౌండ్ల లెక్కింపు పూర్తయింది.
మొదటి ప్రాధాన్య ఓటులో ఎవరికీ మెజార్టీ రాకపోవటంతో (పోలై చెల్లిన ఓట్లలో 50శాతం దాటి ఒక్క ఓటు రావాలి) కాసేపట్లో రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. దీంతో తుది ఫలితాలు శనివారం వచ్చే అవకాశం ఉందని అంచనా. మొత్తం 3,85,996 ఓట్లు పోలయ్యాయి. ఈ స్థానంలో తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న గట్టి పోటీ ఇచ్చారు. కోదండరాం, తీన్మార్ మల్లన్నల మధ్య కూడా తేడా స్వల్పంగానే ఉండటంతో గెలుపు ఎవరిదనే అంశంపై చర్చ సాగుతోంది. మరోవైపు ఏడు రౌండ్లు ముగిసే సరికి 21, 636 ఓట్లు చెల్లకుండా పోయాయి. ఇక్కడు ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
భాజపా, తెరాస మధ్య ఉత్కంఠ పోరు
‘హైదరాబాద్’ స్థానంలో పూర్తయిన ఐదు రౌండ్లలో తెరాస, భాజపా మధ్య పోటీ ఉత్కంఠ పోరు సాగుతోంది. ఐదో రౌండ్ లెక్క శుక్రవారం తెల్లవారుజామున వెలువడింది. తెరాస అభ్యర్థి వాణీదేవి 6,555 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. ఒక్కో రౌండుకు 5.30 గంటల నుంచి 6 గంటల సమయం పడుతోందని రిటర్నింగ్ అధికారి ప్రియాంక తెలిపారు. ఆ లెక్కన ఒకటో ప్రాధాన్య ఓటు లెక్కింపు శుక్రవారం రాత్రికి పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మెజారిటీ ఎవరికీ వచ్చే అవకాశం లేదని అధికారులంటున్నారు. రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు తప్పనిసరి అని, మూడో ప్రాధాన్య ఓట్లని కూడా లెక్కించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
దీంతో శనివారం రాత్రికి తుది ఫలితాలు వెలువడవచ్చని అంచనా వేస్తున్నారు. పలు హాళ్లలో అభ్యర్థుల వారీగా వచ్చిన ఓట్లు, లెక్కించిన మొత్తం ఓట్లకు సరిపోలకపోవడంతో జాప్యం చోటు చేసుకుంటుందని ఏజెంట్లు ఆరోపిస్తున్నారు. టేబుళ్ల వద్ద ఉండే సిబ్బంది తడబాటుకు గురవుతున్నారని, ఉన్నతాధికారులు వాళ్లకు మార్గదర్శనం చేయడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ స్థానంలో ఒక్కో రౌండు లెక్కింపునకు నాలుగు గంటల సమయం పడుతుంటే.. హైదరాబాద్‌లో ఆరు గంటలు పడుతోందని ఏజెంట్లు ఆవేదన చెందుతున్నారు. ఐదు రౌండ్ల తర్వాత సురభి వాణీదేవికి 88,304 ఓట్లు, రాంచందర్‌రావు కు 81,749 ఓట్లు, ప్రొ.నాగేశ్వర్‌కు 42,604 ఓట్లు, చిన్నారెడ్డికి 24,440 ఓట్లు, ఎల్.రమణ (తెదేపా)కు 4,656 ఓట్లు వచ్చాయి. ఐదు రౌండ్లలో 16,712 ఓట్లు చెల్లబాటు కాలేదు.
ఇదీ చదవండి:'పంటలకు గిట్టుబాటు రాకుంటే .. ప్రభుత్వమే కొంటుంది'