ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Tidco Houses: టిడ్కో ఇళ్లకు రుణాలివ్వని బ్యాంకులు.. ప్రభుత్వంపై లబ్ధిదారుల విమర్శలు - ysrcp on tidco houses

Critics on Govt over Tidco houses Loans: గూడు లేని నిరుపేదలకు అధునాతన వసతులతో రాష్ట్ర ప్రభుత్వం టిడ్కో ఆధ్వర్యంలో.. గృహాలను నిర్మిస్తోంది. అయితే ఈ ఇళ్ల నిర్మాణానికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలో ఇళ్లకు బ్యాంకులు ఇవ్వాల్సిన రుణాన్ని స్వచ్ఛందం పేరుతో లబ్ధిదారుల నుంచే వసూళ్లు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Tidco houses
Tidco houses

By

Published : Jan 15, 2022, 7:31 AM IST

No bank loans to TIDCO houses: టిడ్కో(పురపాలక సంఘాల్లో పట్టణ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ) ఇళ్లకు బ్యాంకులు ఇవ్వాల్సిన రుణాన్ని స్వచ్ఛందం పేరుతో లబ్ధిదారుల నుంచే వసూళ్లు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 300, 365, 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో టిడ్కో గృహాలను నిర్మిస్తోంది. ఇందులో 300 చ.అ. విస్తీర్ణం గల ఇళ్లను పేదలకు ఉచితంగా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 365 చ.అ. ఇంటికి రూ.3.15 లక్షలు, 430 చ.అ. ఇంటికి రూ.3.65 లక్షల రుణాన్ని లబ్ధిదారు పేరు మీద బ్యాంకులు మంజూరు చేయాలి. బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో నిర్దేశిత మొత్తాన్ని చెల్లించేందుకు ముందుకొచ్చే లబ్ధిదారులు ఒకేసారి లేదా రెండు విడతల్లో (50 శాతం చొప్పున) కట్టేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు జిల్లా అధికారులకు చేరాయి. లబ్ధిదారుల అంగీకారం మేరకే దీన్ని అమలు చేస్తామని చెబుతున్నా అంత మొత్తాన్ని పేదల నుంచి వసూలుకు ప్రయత్నించడం విమర్శలకు తావిస్తోంది.

పేదలకు భారమే
గూడు లేని నిరుపేదలు అధునాతన వసతులతో టిడ్కో ఆధ్వర్యంలో ఇళ్లు సమకూరుతాయని నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నారు. కొంతమంది అయినా కడతారనే ఆలోచనతో ‘స్వచ్ఛందం’ పేరుతో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం మిగతా వారిపై ఒత్తిడి తెచ్చే ప్రమాదం ఉంది. ఇన్నాళ్లూ ఎదురుచూసిన ఇల్లు తమకు దక్కకుండా పోతుందేమోనన్న ఆందోళనతో కొంతమంది అధిక వడ్డీలకు తెచ్చి అప్పులపాలయ్యే ప్రమాదమూ ఉంది. అమలు స్వచ్ఛందమేనని ప్రభుత్వం చెబుతున్నా తక్షణమే రుణ వాటాలో 50 శాతాన్ని చెల్లించడం తలకు మించిన భారమేనని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. ఉదాహరణకు 430 చ.అ. గృహ లబ్ధిదారు ఇప్పటికిప్పుడు రుణ వాటా రూ.3.65 లక్షల్లో 50% అంటే రూ.1,82,500 కట్టాలి. మిగతా సగాన్ని ఇంటిని అప్పగించే సమయానికి చెల్లించాలి. ఇంత మొత్తాన్ని కట్టే పరిస్థితే ఉంటే ఇన్నాళ్లూ సొంతింటి కోసం ఎందుకు ఎదురుచూస్తామని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బ్యాంకులు ఇచ్చింది రూ.400 కోట్లే

రాష్ట్రవ్యాప్తంగా టిడ్కో ఆధ్వర్యంలో గత ప్రభుత్వం చేపట్టిన 3.10 లక్షల ఇళ్ల నిర్మాణాల్లో 2.62 లక్షల ఇళ్లను మాత్రమే వైకాపా ప్రభుత్వం చేపట్టింది. వీటిలో చిన్నపాటి మౌలిక సదుపాయాలు మినహా 90 శాతానికిపైగా పూర్తయినవి దాదాపుగా లక్ష ఇళ్లు ఉన్నాయి. 2.62 లక్షల ఇళ్ల లబ్ధిదారులకు బ్యాంకులు ఇచ్చే రుణం రూపేణా రూ.4 వేల కోట్ల మేర టిడ్కోకు రావాలి. కానీ, లబ్ధిదారులకు 50 ఏళ్ల వయసు దాటింది.. సిబిల్‌ స్కోర్‌ సరిగా లేదు తదితర కారణాలు చూపుతూ ఇప్పటివరకు సుమారు రూ.400 కోట్లు మాత్రమే మంజూరు చేశాయి.

ఇదీ చదవండి..

financial year returns: రాబడులు మెరుగుపడ్డాయ్!

ABOUT THE AUTHOR

...view details