వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో 21 లక్షల 58 వేల మందికి పైగా అనర్హులున్నారని వైఎస్సార్ నవశకం సర్వే తేల్చింది. మొత్తం అనర్హుల్లో అత్యధికంగా 14 లక్షల 25 వేల మందికి పైగా రేషన్ కార్డుదారులున్నారు. తర్వాతి స్థానాల్లో పింఛన్లు, ఆరోగ్యశ్రీ కార్డుదారులున్నారు. నవంబరు 20 నుంచి డిసెంబరు 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సర్వే జరిగింది. 11 సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజల నుంచి కొత్త దరఖాస్తులు తీసుకోవటంతో పాటు ఇతర ముఖ్యమైన పథకాల లబ్ధిదారుల అర్హతనూ పరిశీలించారు.
వివిధ దశల్లో చేపట్టిన వడపోతలో... రేషన్‌కార్డులు, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, జగనన్న విద్యాదీవెన, వైఎస్సార్ పింఛను కానుక ప్రయోజనం పొందుతున్న వారిలో... మొత్తంగా 21 లక్షల 58 వేల 375 మంది అనర్హులున్నట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ముఖ్యమంత్రి జగన్.. మంగళవారం కలెక్టర్లతో నిర్వహించిన స్పందన వీడియో కాన్ఫరెన్స్‌లోనూ ఈ విషయం ప్రస్తావనకొచ్చినట్లు సమాచారం. అనర్హులను తొలగించే విషయంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సర్వేపై పునఃపరిశీలన చేయించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.