రాజధాని ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన.. కృష్ణా జిల్లాలోని మల్లవల్లి మోడల్ పారిశ్రామికవాడకు ఎట్టకేలకు నీటి కష్టాలు తీరనున్నాయి. పోలవరం కుడికాలువ నుంచి ఇక్కడికి నీటి సరఫరా చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. జక్కంపూడి బండ్ నుంచి రోజుకు 7 మిలియన్ లీటర్ల నీటిని పారిశ్రామికవాడకు సరఫరా చేయాలని జలవనరుల శాఖ ఆదేశాలు జారీ చేసింది. వరద సీజన్‌లో అదనంగా వచ్చే నీటి నుంచి ఈ కేటాయింపు చేస్తున్నట్టుగా పేర్కొంది.
మల్లెపల్లి పారిశ్రామికవాడ నీటి విడుదలకు ప్రభుత్వం అనుమతి
కృష్ణాజిల్లా మల్లవల్లి పారిశ్రామికవాడకు పోలవరం కుడికాలువ నుంచి నీటి సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. రోజుకు ఏడు మిలియన్ లీటర్ల నీటి సరఫరాకు జలవనరుల శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఏపీఐఐసీ సిఫార్సుల మేరకు ఈ మోడల్ పారిశ్రామిక పార్కుకు వరద సీజన్‌లో నీటిని పంపింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ముందుగా ఐదేళ్ల కాలానికి.. ఏడాదికి 0.09 TMCలు లేదా రోజుకు 7 మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేయాలని నిర్ణయించింది. 1166 ఎకరాల్లో APIIC ఏర్పాటు చేసిన ఈ పారిశ్రామికవాడ సమీపంలోని మెగా ఫుడ్ పార్కును ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. ప్రస్తుతం ఈ పార్కుకు నూజివీడు నీటి సరఫరా పథకం నుంచి నీరు వస్తున్నా.. ఆ ప్రాంతానికి నీటి ఇబ్బందులు ఎదురవుతుండటంతో పోలవరం కుడి కాలువ నుంచి సరఫరాకు నిర్ణయించింది. పోలవరం కుడి కాలువ నుంచి మల్లవల్లి పారిశ్రామికవాడ వరకు పంప్ హౌస్ నిర్మాణం, పైప్‌లైను, ఇతర మౌలిక సదుపాయాల కల్పన వ్యయం APIICనే భరించనుంది. పారిశ్రామిక అవసరాలకు వినియోగించే ఈ నీటికి.. ప్రతి వెయ్యి గ్యాలన్లకూ 5 రూపాయల 50 పైసలు.. రాయల్టీ ఛార్జీలు చెల్లించాల్సిందిగా జలవనరులశాఖ స్పష్టం చేసింది.
ఇదీ చదవండి:Covid Cases : కొత్తగా 8,976 కరోనా కేసులు, 90 మరణాలు నమోదు