SC and ST Free electricity: ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. వారు వినియోగించిన విద్యుత్‌కు డిస్కంలు ఇప్పటివరకు బిల్లులు వసూలు చేయట్లేదు కానీ.. ఇకపై ఎస్సీ కాలనీలు, ఎస్టీ తండాల్లో కాకుండా బయట ఉండేవారికి ఉచిత విద్యుత్ వర్తించదంటూ ప్రభుత్వం షాక్ ఇవ్వబోతోంది. దీనికి అనుగుణంగా విద్యుత్ సంస్థలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయా వర్గాల కనెక్షన్ల లెక్కలు తీస్తున్నాయి. కాలనీల వెలుపల ఉన్నవారి నుంచి ఇప్పటివరకు పొందిన రాయితీ మొత్తాన్ని తిరిగి వసూలు చేయడానికి సిద్ధపడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 17.05 లక్షల ఎస్సీ, 5.10 లక్షల ఎస్టీ కనెక్షన్లు ఉండగా ప్రభుత్వ ఇచ్చే రాయితీ పొందుతున్న ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు వెళ్లి, వారి వివరాలను డిస్కంలు సేకరిస్తున్నాయి.
ప్రస్తుతం కుల ధ్రువీకరణ పత్రాన్ని విద్యుత్‌శాఖ కార్యాలయంలో అందిస్తే.. నివాస ప్రదేశంతో సంబంధం లేకుండా డిస్కంలు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నాయి. దీనికి అయ్యే రాయితీ మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తోంది. 2020 జనవరి 21న సీఎండీలు జారీచేసిన అంతర్గత సర్క్యులర్‌లో... ‘ఎస్సీ కాలనీలు, ఎస్టీ తండాలు, ఆవాసాల్లో నివాసం ఉంటున్నవారికే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం వర్తిస్తుందని తెలిపింది. అప్పటినుంచి ఎస్సీ, ఎస్టీ పథకం కింద ఉచిత విద్యుత్ పొందుతున్నవారిని గుర్తించడానికి 8 సర్క్యులర్‌లను డిస్కంలు జారీచేశాయి.
తాజాగా 2022 మే 7న జారీచేసిన తుది సర్క్యులర్ ఆధారంగా.. ఈ నెల 12 నుంచి కనెక్షన్ల సర్వే మొదలుపెట్టాయి. ఆయా కాలనీల్లో కాకుండా వెలుపల ఉన్నవారిని డిస్కంలు గుర్తిస్తున్నాయి. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు... వారి భార్యల పేరిట కనెక్షన్లు తీసుకుని ఉచిత విద్యుత్ పొందినట్లు... అధికారులు పేర్కొంటున్నారు. ఇలాంటివారిని గుర్తించి, వారికి ఇప్పటివరకు రాయితీ రూపేణా ఇచ్చిన మొత్తాన్ని తిరిగి వసూలుచేయాలని డిస్కంలు ఉత్తర్వుల్లో పేర్కొన్నాయి. వివరాల సేకరణ పూర్తయ్యాక ఉచిత విద్యుత్తును కాలనీల్లో ఉండేవారికే వర్తింపజేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే కాలనీల్లో ఉంటేనే పేదలా? బయటిప్రాంతాల్లో ఉన్నవారి పరిస్థితి ఏంటనే విమర్శలు వినిపిస్తున్నాయి.