ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Auto Nagars: రాష్ట్రవ్యాప్తంగా నగరాల్లోని ఆటోనగర్‌లపై కన్ను

రాష్ట్రవ్యాప్తంగా ఆటోనగర్‌లు, పారిశ్రామికవాడలను ఊరికి దూరంగా తరలిస్తామని చెబుతున్న ప్రభుత్వానికి వాటిపై కన్ను పడినట్లు తెలుస్తోంది. వాటిలో సగం స్థలం తనకు ఇచ్చేయాలంటూ.. ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది. అయితే దీనిపై స్థానికులు, వ్యాపారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొన్ని దశాబ్దాలుగా ఆటోనగర్‌లు, పారిశ్రామికవాడలపై ఆధారపడి మేం బతుకుతూ కొన్ని లక్షల మందిని బతికిస్తున్నాం..అయినా కొనుక్కున్న భూముల్లో సగం ఉచితంగా ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వాలని పరిశ్రమల యజమానుల ప్రశ్నిస్తున్నారు.

ap govt focus on auto nagars and industrial areas
ap govt focus on auto nagars and industrial areas

By

Published : Feb 10, 2022, 4:38 AM IST

AP NEWS: రాష్ట్రంలోని వివిధ నగరాలు, పట్టణాల్లో జనావాస ప్రాంతాలకు మధ్యలో ఉన్న ఆటోనగర్‌లు, పారిశ్రామికవాడలు కాలుష్యానికి కారణమవుతున్నాయని, వాటిని ఊరికి దూరంగా తరలిస్తామని చెబుతున్న ప్రభుత్వం... వాటిలో సగం స్థలం తనకు ఇచ్చేయాలనడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఊరి మధ్యలో ఉన్నవాటిని దూరంగా తరలించాలనడంలో భిన్నాభిప్రాయం లేదు. కానీ ఇప్పుడున్న స్థలంలో సగం ఇచ్చేయాలనడంపైనే పారిశ్రామిక యూనిట్లు, వర్క్‌షాపుల యజమానులు అభ్యంతరం చెబుతున్నారు. నగరాలు, పట్టణాల్లోని జనావాస ప్రాంతాల్లో ఉన్న ఆటోనగర్‌లను, పారిశ్రామికవాడల్ని ఖాళీ చేయించి, వాటి నుంచి ఆదాయం సంపాదించేందుకు ‘కోఆర్డినేటెడ్‌ గ్రోత్‌ పాలసీ’ పేరుతో ప్రభుత్వం ఒక విధానం తీసుకొచ్చింది.

వాటిని నివాస, వాణిజ్య ప్రాంతాలుగా మార్చేస్తామని, ఇప్పుడున్న స్థలంలో సగం యజమానులకు ఇచ్చి, మిగతా స్థలం తాను తీసుకుంటానని చెబుతోంది. సగం స్థలం ఇవ్వడం ఇష్టం లేకపోతే... మొత్తం స్థలం మార్కెట్‌ విలువలో సగాన్ని వాటి యజమానులు ప్రభుత్వానికి కట్టాలంటోంది. వారికి ఊరికి దూరంగా ప్రభుత్వ పారిశ్రామిక విధానాన్ని అనుసరించి నిర్ణయించిన ధరకు స్థలాలు కేటాయిస్తామని చెబుతోంది. కొన్ని దశాబ్దాల క్రితం ప్రభుత్వం నుంచి తాము కొనుక్కున్న స్థలాన్ని ఇప్పుడు ఉచితంగా ఎందుకు ఇవ్వాలని వాటి యజమానులు మండిపడుతున్నారు. దశాబ్దాలుగా ఆటోనగర్‌లు, పారిశ్రామికవాడలపై ఆధారపడి బతుకుతున్నామని, ఇప్పుడు వాటిని వదిలేసి బయటకు పొమ్మంటే కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వానికి రూ.కోట్లు

ఇక్కడ ప్రభుత్వం చేస్తున్నది పక్కా వ్యాపారం. పారిశ్రామిక యూనిట్ల యజమానుల నుంచి సగం భూమిని ఉచితంగా తీసుకుని, దాన్ని విక్రయించి ఆదాయం సంపాదించాలని భావిస్తోంది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ‘కోఆర్డినేటెడ్‌ గ్రోత్‌ పాలసీ’కి మంత్రివర్గం ఇటీవలే ఆమోదముద్ర వేసింది. విధివిధానాలు ప్రకటిస్తూ ఆటోనగర్‌లకు, ఇతర పారిశ్రామిక యూనిట్‌లకు విడివిడిగా పరిశ్రమలశాఖ ఈ నెల నాలుగో తేదీన రెండు జీవోలు జారీ చేసింది. వాటి ప్రకారం...

  • రాష్ట్రంలోని వివిధ నగరాలు, పట్టణాల్లో జనావాసాల మధ్యలో ఉన్న ఆటోనగర్‌లను ఏపీఐఐసీ గుర్తిస్తుంది. వాటిని నివాసగృహాలు, వాణిజ్య భవనాల నిర్మాణం వంటి వివిధ అవసరాలకు వినియోగించునేందుకు వీలుగా ‘మల్టీపర్పస్‌ జోన్‌’లుగా మార్చేందుకు అనుమతివ్వాలని సంబంధిత కార్పొరేషన్‌ లేదా మున్సిపాలిటీకి ఏపీఐఐసీయే దరఖాస్తు చేస్తుంది.
  • సంబంధిత మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్‌ ఆటోనగర్‌లలోని పారిశ్రామిక యూనిట్ల యజమానుల నుంచి... భూమి మార్కెట్‌ విలువలో సగం మొత్తాన్ని ‘ఇంపాక్ట్‌ ఫీజు’గా వసూలుచేస్తుంది. భూవినియోగ మార్పిడి ఫీజు దీనికి అదనం. ‘ఇంపాక్ట్‌ ఫీజు’గా వసూలుచేసిన మొత్తాన్ని ఆ తర్వాత ఏపీఐఐసీకి బదలాయిస్తుంది.
  • ఏపీఐఐసీ పారిశ్రామిక పార్కులు, పారిశ్రామిక వాడలతో పాటు, వాటికి వెలుపల ప్రభుత్వం నుంచి స్థలం తీసుకుని ఏర్పాటుచేసిన పరిశ్రమల్ని... బహుళ అవసరాలకు వినియోగించుకునేలా మారుస్తుంది. దానికి వాటి యజమానులు ఆ భూమిలో సగం ఇవ్వాలి, లేదా మార్కెట్‌ విలువలో సగం ప్రభుత్వానికి చెల్లించాలి.
  • సొంతంగా భూమి కొనుక్కుని పరిశ్రమ ఏర్పాటు చేసుకున్నవారు... అది ఖాయిలా పడటమో, కాలుష్యం తదితర సమస్యలతో దాన్ని నిర్వహించలేకనో ఆ స్థలాన్ని వేరే అవసరాలకు వినియోగించుకోవాలనుకుంటే, భూమి మార్కెట్‌ విలువలో ప్రభుత్వానికి 15% చెల్లించాలి.
  • నగరం/ పట్టణాలకు దూరంగా కొత్త పారిశ్రామికవాడలు అభివృద్ధి చేస్తామని, ఇక్కడ ఖాళీ చేసినవారిని అక్కడికి తరలిస్తామని ప్రభుత్వం చెబుతోంది. అలాగని అక్కడేమీ స్థలం ఉచితంగా ఇవ్వదు. ప్రభుత్వ పారిశ్రామిక విధానం ప్రకారం నిర్ణయించిన ధరకు అక్కడ మళ్లీ కొనుక్కోవలసిందే.
  • ‘కొన్ని ఆటోనగర్‌లు, పారిశ్రామికవాడల చుట్టూ జనావాసాలు పెరిగిపోయాయి. చుట్టుపక్కల ప్రాంతాల పట్టణీకరణ, పర్యావరణ సమస్యల వల్ల అక్కడ పరిశ్రమలు నడపలేకపోతున్నామని, భూ వినియోగ మార్పిడికి అవకాశం ఇవ్వాలని పారిశ్రామిక యూనిట్ల యజమానుల నుంచి దరఖాస్తులు వస్తున్నాయి. ఆ భూమిని పారిశ్రామికేతర అవసరాలకు వాడుకునేందుకు అవకాశం ఇవ్వడం వల్ల భూమికి గరిష్ఠ విలువ రాబట్టవచ్చు. ప్రభుత్వానికి ఆదాయ వనరుగానూ ఉపయోగపడుతుంది’ అని గ్రోత్‌ పాలసీని ప్రభుత్వం సమర్థించుకుంటోంది.

భారీ ఆదాయం కోసమే!

రాష్ట్రంలోని మొత్తం 160కి పైగా ఆటోనగర్‌లు, పారిశ్రామికవాడలు ఉన్నాయి. వాటిలో దశాబ్దాల క్రితం ఏర్పడ్డవి చాలా ఉన్నాయి. ఉదాహరణకు విజయవాడనే తీసుకుంటే.. 1964లో పారిశ్రామికవాడ, 1966లో ఆటోనగర్‌ ఏర్పాటు చేశారు. వాటిలో స్థలాల్ని పరిశ్రమల శాఖ నిర్దేశించిన ధరకు పారిశ్రామిక యూనిట్ల యజమానులు కొనుక్కున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతం ఊరి మధ్యకు రావడంతో స్థలం ధరలు బాగా పెరిగాయి. ఇప్పుడు అక్కడ చదరపు గజం ధర రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు ఉంది. విజయవాడ పారిశ్రామికవాడ, ఆటోనగర్‌ కలిపి మొత్తం విస్తీర్ణం 334.8 ఎకరాలు. ప్రభుత్వం తెచ్చిన విధానం ప్రకారం.. 167 ఎకరాలు ఊరికే వచ్చేస్తుంది. ఒక్క విజయవాడ ఆటోనగర్‌లో తన వాటా స్థలాన్ని అమ్మితేనే ప్రభుత్వానికి కోట్లలో ఆదాయం వస్తుంది.

మా భూములు ఎందుకిస్తాం?

‘కొన్ని దశాబ్దాలుగా ఆటోనగర్‌లు, పారిశ్రామికవాడలపై ఆధారపడి మేం బతుకుతూ, కొన్ని లక్షల మందిని బతికిస్తున్నాం. ఇప్పుడు ఖాళీ చేయాలంటే మేమంతా రోడ్డున పడతాం. అయినా కొనుక్కున్న భూముల్లో సగం ఉచితంగా ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వాలి? విజయవాడలో ఇప్పుడున్న ఆటోనగర్‌, పారిశ్రామికవాడలే మా అవసరాలకు చాలవు. అటు కాజ వైపు 500 ఎకరాల్లో, ఇటు పెద అవుటపల్లి వైపు 500 ఎకరాల్లో... జాతీయ రహదారికి సమీపంలో ఆటోనగర్‌కి స్థలం కేటాయించాలని ఎప్పటినుంచో కోరుతున్నాం. అక్కడ స్థలాలు కేటాయించి, అభివృద్ధి చేశాక అక్కడికి వెళ్లాలని చెబితే మా వాళ్లను ఎలాగోలా ఒప్పిస్తాం. అప్పుడు కూడా ఇక్కడున్న స్థలాల్లో ప్రభుత్వానికి వాటా ఇవ్వం. మల్లవల్లి పారిశ్రామికవాడలో గత ప్రభుత్వం ఎకరా రూ.15.50 లక్షల చొప్పున కేటాయిస్తే... ఈ ప్రభుత్వం రూ.79 లక్షలకు పెంచేసింది. ఊరికి దూరంగా కొత్తగా ఏర్పాటు చేస్తామని చెబుతున్న పారిశ్రామికవాడల్లోనూ అంతంత ధరలు పెట్టరని గ్యారంటీ ఏంటి?’-దుర్గాప్రసాద్‌, విజయవాడ ఐలా అధ్యక్షుడు

మాకేమైనా ఉచితంగా ఇచ్చారా?

‘విశాఖ ఆటోనగర్‌ 1,100 ఎకరాల్లో ఉంది. 1,000 నుంచి 1,500 పారిశ్రామిక యూనిట్లు నడుస్తున్నాయి. దాన్ని ఖాళీచేయించి ఊరికి 30-40 కి.మీ. దూరం పంపేస్తే... అంత దూరం వెళ్లి పరిశ్రమలు నడపడం కష్టం. మొత్తంగా ఆటోనగర్‌లను కాకుండా, వాటిలో కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమల వరకు దూరంగా పంపిస్తే సరిపోతుంది. పైగా ఆ భూముల్ని మాకు ఉచితంగానూ ఇవ్వలేదు. తక్కువ ధరకూ ఇవ్వలేదు. మా భూముల్లో ప్రభుత్వం సగం తీసుకుంటామనడాన్ని అంగీకరించం.’ - ఎ.కృష్ణ బాలాజీ, విశాఖ ఆటోనగర్‌ ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు

For All Latest Updates

TAGGED:

auto nagar

ABOUT THE AUTHOR

...view details