ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి సొమ్ము ఉపసంహరణ సాంకేతిక లోపంతోనే జరిగిందని, ఆ నగదును ఇతర అవసరాలకు బదిలీ చేయలేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. డీడీవోలు తిరిగి సమర్పించిన బిల్లులను ట్రెజరీ శాఖ క్లియర్ చేయగానే డెబిట్ అయిన నగదు మళ్లీ ఉద్యోగుల ఖాతాల్లోకి వెళుతుందని పేర్కొంది. ఈ మేరకు ఆర్థికశాఖ అదనపు కార్యదర్శి కె.వెంకటేశ్వర్లు మంగళవారం హైకోర్టులో అఫిడవిట్ వేశారు. బిల్లులను తిరిగి సమర్పించడం, క్లియర్ చేసే ప్రక్రియ మొదలైందన్నారు.
ట్రెజరీ నిబంధల ప్రకారం మార్చి 31 నాటికి పెండింగ్‌లో ఉన్న బిల్లులన్ని రద్దువుతాయని, ఆ తర్వాత బిల్లుల్ని తిరిగి సమర్పిస్తారన్నారు. ఈ విషయంలో కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించలేదని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. జీపీఎఫ్ సొమ్ము ఉపసంహరణపై పిటిషనర్ దాఖలు చేసిన అఫిడవిట్‌కు సమాధానంగా (రిప్లై) ప్రభుత్వం వేసిన ఈ కౌంటర్ రికార్డుల్లోకి చేరకపోవడంతో విచారణను హైకోర్టు ఈ నెల 22కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.