పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నిర్ణయించిన రిజర్వేషన్లపై న్యాయ పరంగా చిక్కులు ఎదురైతే వెంటనే పురపాలిక ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలన్న ఆదేశాలతో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ తదుపరి చర్యలు తీసుకుంటోంది. వివిధ పురపాలక, నగరపాలక సంస్థల్లో వార్డులు, డివిజన్ల పునర్విభజన ప్రక్రియను వచ్చే నెల 20లోగా అధికారులు పూర్తి చేయనున్నారు.
2011 లెక్కల ప్రకారం ఓటర్ల గుర్తింపు
జులై 2తో పట్టణ, స్థానిక సంస్థల్లో పాలకవర్గ పదవీకాలం ముగిసింది. ఆలస్యంగా ఎన్నికలు నిర్వహించిన కాకినాడ నగర పాలక సంస్థలో ప్రస్తుతం పాలక వర్గం ఉంది. మిగతా 109 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల కోసం 2011 జనాభా లెక్కల ప్రకారం ఓటర్ల జాబితాల తయారీతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్లను గుర్తించారు.
ముసాయిదా ప్రకటన జారీ
రాష్ట్రంలో 70కి పైగా పురపాలక, నగరపాలక సంస్థల్లో వార్డులు, డివిజన్ల పునర్విభజన ప్రక్రియ పూర్తైంది. వార్డు, డివిజన్ విస్తీర్ణం, వీటిలో జనాభా, ఓటర్ల సంఖ్య ఒకే తరహాలో ఉండాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఈ ప్రక్రియతో అత్యధిక పట్టణ, స్థానిక సంస్థల్లో వార్డులు, డివిజన్ల సంఖ్య పెరుగుతోంది. పురపాలక, నగరపాలక సంస్థల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి ముసాయిదా ప్రకటన జారీ చేస్తోంది. గత నెల రోజుల వ్యవధిలో 50కి పైగా పట్టణ, స్థానిక సంస్థల నుంచి వచ్చిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది. వీటిపై ఆయా పురపాలక, నగరపాలక సంస్థలు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి తుది ప్రకటన చేయనున్నాయి.