ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎయిడెడ్‌ విద్యావ్యవస్థకు చరమగీతం.. ఆర్థిక భారం దించుకునేందుకు కసరత్తు

ఎయిడెడ్‌ విద్యావ్యవస్థకు రాష్ట్ర ప్రభుత్వం చరమగీతం పాడనుంది. ఇప్పటికే 418 పాఠశాలలు మూతపడగా, 753 విద్యాలయాలు ప్రైవేటుగా మారిపోయాయి. కొత్త నియామకాలు లేనందున భవిష్యత్తులో అన్నీ మూతపడే అవకాశం ఉంది. ఎయిడెడ్‌కు పూర్తిగా దూరం జరిగి, ఆర్థిక భారం దించుకునేందుకు కసరత్తు చేస్తోంది.

ఎయిడెడ్‌ విద్యావ్యవస్థకు చరమగీతం
ఎయిడెడ్‌ విద్యావ్యవస్థకు చరమగీతం

By

Published : Jul 16, 2022, 4:53 AM IST

రాష్ట్రంలో తొలితరానికి జ్ఞానం అందించిన ఎయిడెడ్‌ విద్యాసంస్థలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. స్వల్ప ఫీజులతో చదువుకున్న విద్యార్థులు... ఈ ఏడాది ఫీజు చెల్లించాల్సి వస్తోంది. బడులు మూతపడినచోట విద్యార్థులు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు లేదా ప్రభుత్వ విద్యాలయాలకు వెళ్లాల్సి వచ్చింది. ఉపాధ్యాయులను ప్రభుత్వానికి అప్పగించి ప్రైవేటుగా మారిన వాటిలో ఫీజు కట్టాల్సి రావడం పేద విద్యార్థులకు భారమవుతోంది. విద్యార్థుల ప్రవేశాలు తగ్గాయని, అధ్యాపకుల వేతనాలు, కొత్త నియామకాలు ఆర్థిక భారమని, యాజమాన్యాలు సరిగా నడపలేకపోతున్నాయనే కారణాలతో.... స్వచ్ఛందమంటూనే ఈ వ్యవస్థకు ప్రభుత్వం ముగింపు పలికింది. ఆస్తుల అప్పగింత, సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేయవచ్చనే ఐచ్ఛికాలను ఇచ్చినా... నిబంధనల పేరుతో ఒత్తిడి తప్పడం లేదు. దీనివల్ల కొన్ని యాజమాన్యాలు సిబ్బంది, మరికొన్ని ఆస్తులతో సహా సంస్థలను ప్రభుత్వానికి అప్పగించాయి. సిబ్బందిని ఇచ్చేసిన కొన్ని సంస్థలు ప్రైవేటుగా కొనసాగలేక మూతపడుతున్నాయి. రాష్ట్రంలో 418 వరకు ఎయిడెడ్‌ పాఠశాలలు మూతపడ్డాయి.

ఎయిడెడ్‌ విద్యాసంస్థల మూసివేతపై గతేడాది విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి అప్పగించిన వాటిని వెనక్కి తీసుకునేందుకు అవకాశమిచ్చారు. విద్యాసంవత్సరం మధ్యలో ఉండటం; విద్యార్థులు, తల్లిదండ్రుల వ్యతిరేకతతో కొంతకాలం అధికార యంత్రాంగం మౌనంగా ఉంది. ఆందోళనలు సద్దుమణిగాక సిబ్బందిని అప్పగించిన వాటిని ప్రైవేటుగా నిర్వహించుకునేందుకు అనుమతించింది. అన్‌ఎయిడెడ్‌గా మారిన విద్యాసంస్థలు ఈ ఏడాది విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయనున్నాయి. పిల్లలు తక్కువగా ఉండి ప్రైవేటుగా నిర్వహించలేని సంస్థలను మూసేస్తున్నారు. ఎయిడెడ్‌లో ప్రస్తుతం పనిచేస్తున్నవారు పదేళ్లలో పదవీ విరమణ పొందనున్నారు. తర్వాత వాటికవే ప్రైవేటుగా మారిపోనున్నాయి. ఇప్పటికే 4 జూనియర్‌ కళాశాలల్లో ఒక్కరూ ఎయిడెడ్‌ సిబ్బంది లేరు.

రాష్ట్రంలో 19వందల 88 ఎయిడెడ్‌ పాఠశాలలు ఉండగా... వీటిలో 753 యాజమాన్యాలు సిబ్బందిని ప్రభుత్వానికి అప్పగించాయి. 83 సంస్థలు ఆస్తులతో సహా అప్పగించాయి. సిబ్బందిని అప్పగించిన వాటిలో 400 సంస్థల మూతకు యాజమాన్యాలు సిద్ధమయ్యాయి. 40 మంది కంటే తక్కువ పిల్లలు ఉన్నందున 418 పాఠశాలల మూసివేతకు పాఠశాల విద్యాశాఖ నోటీసులిచ్చింది. మరో 422 బడులపైనా నోటీసుల కత్తి వేలాడుతోంది. పిల్లల సంఖ్య పెరగడంతో వీటికి మినహాయింపునిచ్చారు. ఇప్పుడు మౌలిక సదుపాయాల పరిశీలన కమిటీలిచ్చే నివేదికపైనే ఎయిడెడ్‌ విద్యాసంస్థల భవితవ్యం ఆధారపడనుంది. ఇక 122 ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలలు ఉండగా... 70 యాజమాన్యాలు సిబ్బందిని అప్పగించాయి. మరో ఏడు కాలేజీలు ఆస్తులతో సహా ఇచ్చేశాయి. 41 కళాశాలలే ఎయిడెడ్‌లో కొనసాగుతున్నాయి. సిబ్బందిని అప్పగించిన 70 కళాశాలల్లో ఇప్పటికే ప్రొద్దుటూరు గౌరీశంకర్‌ విద్యాలయం మూతపడగా, కాకినాడ I.D.L కళాశాలలను మూసేస్తామని యాజమాన్యం ప్రకటించింది.

రాష్ట్రంలో 137 ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలలు ఉండగా, ఆరు యాజమాన్యాలు ఆస్తులతో సహా ప్రభుత్వానికి అప్పగించాయి. లయోలా లాంటి ఏడు కళాశాలలు గ్రాంట్‌ఇన్‌ ఎయిడ్‌కు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. మొదట 124 డిగ్రీ కళాశాలలు సిబ్బందిని అప్పగించగా... వీటిలో 43 సంస్థలు వెనక్కి వెళ్లాయి. ఎయిడెడ్‌లో కొనసాగేందుకు అంగీకరించాయి. వీటిలో కొన్ని యాజమాన్యాలు ప్రైవేటుగా నిర్వహించలేక ఇతర సంస్థలకు లీజుకిచ్చాయి. అర్హులైనవారికి ఉన్నత విద్యలో బోధన రుసుముల చెల్లింపున్నా.... ప్రత్యేక ఫీజుల పేరుతో యాజమాన్యాలు వసూలు చేస్తున్నాయి. బోధన రుసుముల చెల్లింపు వర్తించనివారు గతంలో నామమాత్రపు ఫీజులతో చదువుకునేవారు. ఇప్పుడు కళాశాల నిర్ణయించిన ఫీజు చెల్లించాల్సి వస్తోంది.

ఇవీ చూడండి

పోలవరం కాఫర్ డ్యాం ఎత్తు పెంపు.. వరద ముంచెయ్యకుండా చర్యలు

గోదావరి నీటిమట్టం పెరిగే అవకాశం.. అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్​

ABOUT THE AUTHOR

...view details