Governor speech on AP Budget Session: రాష్ట్రంలో గత మూడేళ్లుగా వికేంద్రీకృత, సమ్మిళిత పాలనకు తన ప్రభుత్వం కృషి చేస్తోందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. ఆ లక్ష్యానికి అనుగుణంగానే ప్రస్తుతమున్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించిందన్నారు. రానున్న ఉగాది (ఏప్రిల్ 2న) నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన మొదలవుతుందని వెల్లడించారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభాన్ని పురస్కరించుకుని సోమవారం ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. రాష్ట్ర పౌరులందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండేందుకు అవసరమైన ప్రతి చర్యనూ చేపట్టేందుకు తన ప్రభుత్వం కట్టుబడి ఉందని... ఆ దిశగా మహత్మాగాంధీ ఆలోచనల నుంచి ప్రేరణ పొందిందని వివరించారు. వివిధ సంక్షేమ పథకాలకు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ) విధానంలో ఇప్పటివరకు రూ.1,32,126 కోట్ల మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ చేసినట్లు వివరించారు. గవర్నర్ ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే...
- రాష్ట్రంలో 54 సాగునీటి ప్రాజెక్టుల్లో 14 మొత్తంగా, 2 పాక్షికంగా పూర్తయ్యాయి. మిగతావి పురోగతిలో ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు 77.92% పూర్తయింది. 2023 జూన్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేలా ప్రభుత్వం వేగంగా పనులు చేస్తోంది.
- సౌర విద్యుత్తు ప్రాజెక్టు నుంచి ఏడాదికి 15వేల మిలియన్ యూనిట్ల విద్యుత్తు సేకరణలో భాగంగా ప్రతి యూనిట్‌కు రూ.2.49 రేటు చొప్పున 25 ఏళ్ల కాలానికి ఎన్ఈసీఐతో ఒప్పందం కుదుర్చుకుంది. ఫలితంగా ప్రతి యూనిట్‌కు రూ.2.50 ఆదా అవుతుంది. 25 ఏళ్ల కాలానికి రూ.3,750 కోట్ల పొదుపు సాధ్యమవుతుంది.
- విజయనగరం జిల్లా భోగాపురం వద్ద గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని, నెల్లూరు జిల్లా దగదర్తి వద్ద గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని వేగవంతం చేయడానికి ప్రభుత్వం కేంద్రంతో నిరంతరం సంప్రదిస్తోంది.
- నూతన అభివృద్ధి బ్యాంకు ఆర్థిక సాయంతో రూ.6,400 కోట్ల పెట్టుబడితో 3వేల కిలోమీటర్ల రెండు లైన్లతో మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాల వరకు రోడ్లను అనుసంధానిస్తున్నాం. రూ.6,319 కోట్ల వ్యయంతో 8,715 కిలోమీటర్ల మేర చేపట్టిన రోడ్ల పనులు చురుగ్గా సాగుతున్నాయి. రూ.1,073 కోట్లతో 9,200 కిలోమీటర్ల గ్రామీణ రోడ్లకు మరమ్మతులు జరుగుతున్నాయి.
- గత మూడేళ్లలో రూ.36,304 కోట్ల పెట్టుబడితో 91 భారీ, మెగా పారిశ్రామిక ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. 56,611 మందికి ఉపాధి లభించింది.
- రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం.
కొవిడ్ పూర్వ స్థితికి ఆర్థిక వ్యవస్థ...
- నిరుడు తక్కువ వృద్ధి నమోదైనప్పటికీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కొవిడ్ పూర్వ స్థితికి పుంజుకుంది. ప్రభుత్వ ప్రభావవంతమైన చొరవతో 2020-21లో 0.22% వాస్తవ జీఎస్డీపీ వృద్ధి నమోదైంది. అదే కాల వ్యవధిలో దేశ వాస్తవ జీడీపీ 7.3% తగ్గింది.
- 2021-22 సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ముందస్తు అంచనాలు ప్రస్తుత ధరలతో 16.82% సమగ్ర వృద్ధిని చూపిస్తున్నాయి. తలసరి ఆదాయం గతేడాది 1,76,707గా ఉండగా.. 15.87% వృద్ధి రేటుతో ఇప్పుడు 2,04,758కి పెరిగింది.
- ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. 5 విడతల కరవు భత్యం ఒకేసారి విడుదల చేశాం. 23% ఫిట్మెంట్తో 11వ వేతన సవరణ అమలు చేశాం. పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచాం.