ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రభుత్వం విద్యారంగంలో నాణ్యతకు ప్రాధాన్యమిస్తోంది: గవర్నర్​ బిశ్వభూషణ్

ప్రభుత్వం ఉన్నత విద్యారంగంలో నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ.. గణనీయమైన వృద్ధిని సాధిస్తోందని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. రాష్ట్రానికి భారీ ప్రాజెక్టులు రానున్నాయని.. వాటికి అనుగుణంగా శిక్షణ ఇచ్చేందుకు కొత్త కోర్సులు రూపొందించాలని సూచించారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం రెండో స్నాతకోత్సవంలో గవర్నర్​ వర్చువల్‌గా ప్రసంగించారు.

Governor Bishwabhushan Harichandan
స్నాతకోత్సవంలో ప్రసంగిస్తున్న గవర్నర్​

By

Published : Mar 9, 2022, 3:34 PM IST

రాష్ట్రప్రభుత్వం ఉన్నత విద్యారంగంలో నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ.. గణనీయమైన వృద్ధిని సాధిస్తోందని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. కొవిడ్ కారణంగా తరగతి గది అభ్యాసం నుంచి ఆన్‌లైన్ వేదికలు, డిజిటల్ సాంకేతికతలను ప్రత్యామ్నాయ వ్యవస్థగా స్వీకరించాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు. సమాజంలోని అన్ని రంగాలపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపిందన్నారు. జాతీయ విద్యా విధానం-2020 విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిందని చెప్పారు. బోధనా విధానంలో సంస్కరణలకు పెద్దపీట వేస్తోందని తెలిపారు. ఈ క్రమంలో మార్పును స్వాగతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందంజలో ఉండటం అభినందనీయమన్నారు.

సమగ్ర అభ్యాస ప్రక్రియ, అందరికీ సమానమైన, సమ్మిళిత విద్య జాతీయ విద్యా విధానంలో అంతర్భాగమై ఉన్నాయని గవర్నర్ వివరించారు. నూతన విధానం దేశంలో విద్యా వ్యవస్ధ అభివృద్ధికి మార్గనిర్దేశం చేస్తుందని, 2035 నాటికి ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తిని 50 శాతానికి పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని కులపతి పేర్కొన్నారు. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ అంబేద్కర్ విశ్వవిద్యలయానికి 12-B హోదా కల్పించడం హర్షణీయమని, మరోవైపు దేశంలోని పరిశుభ్రమైన ఉన్నత విద్యాసంస్థల్లో ఈ సంస్థ నాలుగో స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు.

శ్రీకాకుళం జిల్లాలో భావనపాడు పోర్టు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, న్యూ షిప్పింగ్ హార్బర్ లాంటి భారీ పారిశ్రామిక ప్రాజెక్టులు రానున్నాయని.. వాటి అవసరాలకు అనుగుణంగా నైపుణ్యత కలిగినవారు అందుబాటులో ఉండేలా శిక్షణ ఇచ్చేందుకు కొత్త కోర్సులు రూపొందించాలని తెలిపారు. స్నాతకోత్సవం నేపథ్యంలో బంగారు పతకాలు పొందిన వారిని, డాక్టరేట్ సాధించినవారిని గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు. కులపతి హోదాలో శ్రీకాకుళంలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం రెండో స్నాతకోత్సవంలో గవర్నర్​ వర్చువల్‌గా ప్రసంగించారు.

ఇదీ చదవండి:"గుండె రాయి చేసుకున్నా.. ఆ 400 కుటుంబాల కోసం.."

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details