అత్యున్నత చలన చిత్ర పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును దక్కించుకున్న ప్రముఖ కథా నాయకుడు రజనీకాంత్‌ను రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ అభినందించారు. భారత సినీ రంగానికి చేసిన విశేషసేవలకు గాను రజనీకాంత్.. ఈ పురస్కారానికి ఎంపిక కావడం ఆనందంగా ఉందన్నారు. 40 సంవత్సరాలకు పైగా విభిన్న పాత్రలకు జీవం పోసిన ఆయనకు ఈ పురస్కారం ద్వారా తగిన గుర్తింపు.. గౌరవం తీసుకొచ్చిందని ప్రశంసించారు. సినీ నటుడిగా రజనీ అత్యధిక ప్రజాదరణను పొందారని గవర్నర్ కొనియాడారు.
'ప్రేక్షకుల మదిలో ఆయన ఇలాగే ఉండాలి'
దాదా సాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత రజనీ కాంత్‌కు తెలుగుదేశం అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తమ నటుడిగా రజనీకాంత్ మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. భారతీయ సినిమాకు చేసిన అద్భుతమైన సేవకు ప్రతీకగా దాదా సాహెబ్ పాల్కే అవార్డు అందుకుంటున్నారని ప్రశంసించారు. తన అద్భుత నటనతో కోట్లాది అభిమానులను అనతికాలంలోనే సంపాదించుకున్నారని కొనియాడారు. సమాజానికి ఎంతో స్ఫూర్తినిచ్చే సినిమాల్లో రజినీకాంత్ నటించి సినీరంగంలో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు . తన విలక్షణ నటనతో భవిష్యత్తులోనూ ప్రేక్షకుల మదిలో ఇలాగే ఉండాలని ఆయన కోరారు.
ఇదీ చూడండి.'ఈ అవార్డుకు రజనీ అన్ని విధాలా అర్హులు'