శాసనసభ, శాసనమండలి ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్ జారీ చేశారు. పాలన వికేంద్రీకరణ బిల్లుతో పాటు సీఆర్డీఏ చట్టం ఉపసంహరణకు సంబంధించిన బిల్లులు శాసనసభలో ఆమోదం పొందినా... మండలిలో మాత్రం ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. ఉభయ సభలను ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ నిర్ణయం వెలువరించడం వల్ల.. ప్రస్తుతం ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే రెండు సభలు ప్రోరోగ్ అవడం వల్ల ఈ బిల్లుల్లోని అంశాలపై ఆర్డినెన్స్ తెచ్చుకునే వెసులుబాటు కలిగిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రెండు వేర్వేరు ఆర్డినెన్సులను జారీ చేయడం ద్వారా... ప్రభుత్వ విధాన నిర్ణయాలను అమలు చేసే అవకాశం కలిగిందని భావిస్తున్నాయి. గతంలో వివిధ రాష్ట్రాల అసెంబ్లీలు, పార్లమెంటులోనూ ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమైన సమయంలో... ఆర్డినెన్సుల ద్వారా విధాన నిర్ణయాలు అమలు జరిగినట్లు ప్రభుత్వం చెబుతోంది. 2013 భూసేకరణ చట్టం, ట్రిపుల్ తలాక్ సహా మరో రెండు కీలకమైన అంశాలు రాజ్యసభలో పెండింగ్‌లో ఉండగానే... ఆర్డినెన్సులు జారీ అయ్యాయని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
ఆ రెండు బిల్లులకు ఆమోదమా..ఆర్డినెన్సా? - శాసన సభ సమావేశాలు తాజా వార్తలు
ఉభయసభలు ప్రోరోగ్ కావటం వల్ల... పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దుపై ఎలా ముందుకెళ్లాలని ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. శాసనసభలో రెండు బిల్లులు ఆమోదం పొందడం వల్ల చట్టరూపం వచ్చినట్టేనా... లేక అదే అంశాలతో ఆర్డినెన్స్ జారీచేసే వెసులుబాటు ఉందా అనే అంశంపై మథనం సాగిస్తోంది. అయితే బడ్జెట్ సమావేశాల్లోపు ఆర్డినెన్సు తీసుకొచ్చే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్ట ఉపసంహరణ బిల్లులపై హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలు ఇంకా పెండింగ్‌లో ఉండడం వల్ల ఆర్డినెన్సు జారీపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతున్నట్టు సమాచారం. ఆర్డినెన్సుల జారీకి న్యాయపరంగా, రాజ్యాంగపరంగా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత లోతుగా చర్చించి తదుపరి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఆర్డినెన్సులు జారీ చేయని పక్షంలో... ఈ రెండు బిల్లులకు స్వల్ప మార్పులు చేసి మరోమారు శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకునే అంశాన్నీ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇదీ చదవండి:జగన్.. బెయిల్ నిబంధనలు అతిక్రమిస్తున్నారు : సీబీఐ