Government teachers Salary issue : తెలంగాణ వ్యాప్తంగా 14 జిల్లాల ఉపాధ్యాయులు జీతాల కోసం ఎదురుచూస్తున్నారు. మొత్తం 33 జిల్లాలకు మంగళవారం నాటికి 19 జిల్లాల్లో మాత్రమే వేతనాలు అందాయి. సిద్దిపేట, నిర్మల్, యాదాద్రి, భద్రాద్రి జిల్లాల్లో మంగళవారమే బ్యాంకు ఖాతాల్లో జమవ్వడం గమనార్హం. మిగిలిన కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, ములుగు, కామారెడ్డి, వరంగల్ తదితర 14 జిల్లాల్లో ఎప్పుడు అందుతాయో తెలియడంలేదని టీచర్లు ఆందోళన చెందుతున్నారు.
మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు కూడా అసలే అందలేదు. గతనెల వారికి 25 తర్వాత అందడంతో ఈసారి ఎప్పుడొస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా తీసుకున్న రుణాలపై ఈఎంఐలు ప్రతినెలా 5, 10 తేదీల్లో చెల్లించాలి. ఆ గడువులోపు బ్యాంకు ఖాతాల్లో డబ్బుల్లేక జరిమానా చెల్లించాల్సి వస్తోందని టీచర్లు వాపోతున్నారు. ఇంకా మెడికల్ రీఎంబర్స్‌మెంట్, సరెండర్ లీవ్, సెలవు వేతనాలు, బిల్లుల మంజూరు కోసం ఎదురుచూడక తప్పడం లేదు. ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్ సొమ్ము అవసరాలకు తీసుకుందామనుకుంటే సకాలంలో అందడం లేదని చెబుతున్నారు. రుణాల చెక్కులు బౌన్స్ అవుతున్నందున బ్యాంకు సిబిల్ స్కోర్ కోల్పోతున్నామని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
12 రోజులు గడిచినా జీతాలేవి..నెలలో 12 రోజులు గడిచినా వేతనాలు, పింఛన్ల బడ్జెట్ విడుదల చేయకపోవడాన్ని టీఎస్‌యూటీఎఫ్ ఒక ప్రకటనలో ఖండించింది. ‘మూడు డీఏలు పెండింగ్ ఉన్నాయి. సరెండర్ లీవుల డబ్బులు రావడం లేదు. ఇప్పుడు వాటి బదులు జీతం ఇస్తే చాలు అనే దగ్గరకు రాష్ట్రంలోని ఉపాధ్యాయుల పరిస్థితి వచ్చిందని టీఆర్‌టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కటకం రమేశ్ తెలిపారు.