వేలాది మంది విద్యార్థులకు విద్యాదాహం తీర్చిన ఓరుగల్లులోని ఆంధ్ర విద్యాభివర్థిని విద్యా సంస్థలు 75 వసంతాలు పూర్తి చేసుకున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన వజ్రోత్సవ వేడుకలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యా సంస్థల సంచికను ఆయన ఆవిష్కరించారు. మూడున్నర కోట్లతో నిర్మించనున్న ప్లాటినం జూబ్లీ బ్లాక్‌కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హోం మంత్రి మహమూద్ ఆలీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎంపీలు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, బండా ప్రకాష్, పసునూరి దయాకర్, తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, వరంగల్ మేయర్ గుండా ప్రకాష్, ఎమ్మెల్యే నరేందర్, పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
పాశ్చాత్యం తగ్గించుకోవాలి..
మాతృభాష నిరాదరణకు గురవుతోందని వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. పాశ్చాత్య వ్యామోహాన్ని తగ్గించుకోవాలని చెప్పారు. మాతృభాషలోనే ప్రాథమిక విద్యాభ్యాసం జరగాలని అన్నారు. మాతృభాష నేర్చుకుంటేనే ఉద్యోగాలనే అంశాన్ని ప్రభుత్వాలు అమలు చేయాలని సూచించారు. విద్యావిధానంలో మార్పులు రావాలని.. నైతిక విలువలు పెంచే విద్య విద్యార్థులకు అందాలని.. అప్పుడే వారి భవిష్యత్ బాగుంటుందని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. నిత్య నూతన ఆలోచనలతో ముందుకు సాగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. మహిళలపై చిన్నచూపు తగదని, నిర్భయ లాంటి ఘటనలు ఇంకా జరగడం సిగ్గుచేటని అన్నారు. చట్టంతో పాటు మన ఆలోచనా విధానంలోనూ మార్పులు వస్తేనే... ఈ తరహా దుర్ఘటనలకు అడ్డుకట్ట పడుతుందని తెలిపారు.
పూర్వ విద్యార్థి కావడం అదృష్టం..