NO SUPPORT:జాతీయ సంస్థల ఏర్పాటుకు పూర్తి సహకారం అందించాల్సిన రాష్ట్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. యోగా, నేచురోపతి వైద్య, పరిశోధన సంస్థ ఏర్పాటుపై తన బాధ్యతను నెరవేర్చడంలేదు. మంగళగిరి ఎయిమ్స్ తరహాలోనే ప్రకృతి వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశమున్నా చొరవ తీసుకోవడంలేదు. తెదేపా హయాంలో చంద్రబాబు కృషితో ఏపీలో ఈ సంస్థ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. భవనాల నిర్మాణానికి రూ.150 కోట్లను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. రాష్ట్రం ఉచితంగా భూమిని, విద్యుత్తు, నీటి సదుపాయం కల్పిస్తే సరిపోతుంది. అదనంగా నిధులు కేటాయించాల్సిన అవసరంలేదు. అయినా... సంస్థ ఏర్పాటులో రాష్ట్ర విముఖతపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
2018లో కేటాయించిన స్థలం వెనక్కి
రాష్ట్ర విభజనకు ముందు నుంచి హైదరాబాదులోని ‘నేచురోపతి’ సంస్థ ద్వారా ఓపీ, ఐపీ ద్వారా రోగులకు సేవలు అందుతున్నాయి. విభజన అనంతరం ఏపీలో ఇలాంటి సంస్థ లేకుండా పోయింది. గత ప్రభుత్వం పట్టుబట్టడంతో కేంద్రం సెంట్రల్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా, నేచురోపతి (సీఆర్‌ఐవైఎన్) సంస్థను రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. విజయవాడ శివారు గన్నవరం సమీపంలోని కొండపావులూరు వద్ద 25 ఎకరాలను 2018 జులై 5న సంస్థకు బదిలీ చేశారు. పనులు ప్రారంభించేందుకు కేంద్రం సమాయత్తం అవుతుండగానే భూమిని రాష్ట్ర ప్రభుత్వం పేదల అవసరాలకు మళ్లించింది. సమీపంలోనే మరో 25 ఎకరాలను కేటాయించేందుకు సుముఖమని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా అధికారిక చర్యలు మాత్రం కొరవడ్డాయి. అయితే ఆస్థలంపై ఇతరుల దృష్టి పడకుండా ఉండేందుకు సంబంధిత శాఖ వారు బోర్డు పాతుకున్నారు.