ప్రభుత్వ, అసైన్డ్, వాగు, కొండ, పోరంబోకు తదితర భూములపై వీఆర్వోలకు పూర్తి అవగాహన ఉండాలి. అసైన్డు భూముల నిషిద్ధ చట్టం-1997, సవరణ చట్టం-2007 ప్రకారం ఇలాంటి భూముల అన్యాక్రాంతం నిషిద్ధం. వీటిపై ఎవరైనా తమ హక్కును కోరుతూ... ఫారం-10 కింద దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి, ప్రత్యేక రిజిష్టర్‌లో నమోదు చేసి, ఆర్డీవో సంతకం తీసుకోవాలి. అలాంటి భూములను ఆర్‌ఐ క్షేత్రస్థాయిలో విచారించి తహసీల్దారుకు సిపార్సు చేయాలి. అప్పుడు తహసీల్దారు తన డిజిటల్ ‘కీ’ ద్వారా ఆన్‌లైన్ రికార్డుల్లో నమోదు చేయాలి. ఇవన్నీ జరగకుండానే కొందరు కంప్యూటర్ ఆపరేటర్లు డిజిటల్ ‘కీ’ల ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారు. మరికొందరు అధికారులు తమ ఉద్యోగ విరమణ సమయంలో అవినీతికి పాల్పడుతున్నారు.
* నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తమ్మినపట్నంలో దేవాదాయ శాఖకు చెందిన 209 ఎకరాల భూమిని పోర్టుకు ఇచ్చి, పరిహారం పొందారు. ప్రస్తుతం వెబ్‌ల్యాండ్ అడంగల్‌లో భూములన్నీ పోర్టు పేరిటే ఉన్నాయి. అయితే తప్పుడు సర్వే నంబరు సృష్టించి 11 మంది వ్యక్తుల పేర్లతో అడంగల్‌లో మార్పులు చేశారు. ఈ వ్యవహారంలో తహసీల్దార్, కార్యాలయ సూపరింటెండెంట్, కంప్యూటర్ ఆపరేటర్ సస్పెండ్ అయ్యారు.
* నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరులో సుమారు రూ.60 కోట్ల విలువైన 15 ఎకరాల భూమిని ప్రకాశం జిల్లా గుడ్లూరులో డేటా ఎంట్రీ ఆపరేటర్ ప్రైవేట్ వ్యక్తుల పేర్లపై మార్చాడు.
* గుంటూరు జిల్లా మాచవరం తహసీల్దార్ కార్యాలయంలో సరైన దస్త్రాలు లేకుండానే ప్రభుత్వ భూముల సర్వే నంబర్లపై ప్రైవేట్ వ్యక్తుల పేర్లను రాశారు. వెబ్‌ల్యాండ్, అడంగళ్‌లో మార్పులు చేశారు. ఈ కేసులో ఆపరేటర్‌పై చర్యలు తీసుకున్నారు. ఇతరులపై విచారణ సాగుతోంది.
రూ.వంద కోట్ల భూములకు ఎసరు