తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా మావల మండలం దస్నాపూర్ శివారులో సర్వేనంబర్ 21/1/ఏ, 21/1/డీలో 20 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. 1954 నుంచి అందుబాటులో ఉన్న పహానీ, రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తే.... ఇప్పటివరకు పడావు భూమిగానే ఉంది. వాస్తవానికి 21/1 సర్వేనెంబర్లో మొత్తం 146 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండేది. ఆ తర్వాత జనావాస ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాలు వెలిశాయి. ప్రస్తుతం రెండు సర్వే నంబర్లలో కలిసి మొత్తం 20 ఎకరాల భూమి మాత్రమే ఉంది.
ఆ భూమిని ప్రభుత్వం తమ పూర్వీకులకు కేటాయించిందని... తామే వారసులమంటూ 1994లో ఇద్దరు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. 2005లో హద్దులు గుర్తించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదే ఏడాది అప్పటి అధికారులు... ఆ భూమికి వారసులెవరూలేరని కోర్టుకు అప్పీలు చేశారు. 20 ఎకరాల భూమిని యథావిథిగా ఉంచాలని 2005లోనే హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది. అప్పటి నుంచి ఆ స్థలం పడావుగానే ఉంది. కానీ మే నెల 28, 31 తేదీల్లో కొంతమంది అక్రమంగా ఆ భూమికి కంచె చేయడమే కాకుండా.... ట్రాక్టర్లతో దున్నే ప్రయత్నం చేయడం వివాదస్పదమైంది.