లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో వ్యవసాయ కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకాలూ కలిగించొద్దని మరోమారు రాష్ట్రప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, విక్రయం, యంత్ర సామగ్రి సరఫరా అంశాల్లో ఆటంకాలు లేకుండా చూడాలని క్షేత్రస్థాయిలో దీనికి సంబంధించిన కార్యాచరణ అమలు అయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని కలెక్టర్లకు సూచనలు జారీ అయ్యాయి. క్షేత్రస్థాయిలో వ్యవసాయ పనులు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, మార్కెటింగ్, ట్రాక్టర్లు, యంత్ర పరికరాలు, విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల సరఫరా దుకాణాల తెరుచుకునేందుకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
లాక్‌డౌన్ సడలింపులపై మరోసారి ప్రభుత్వ ఆదేశాలు - lockdown news
లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో వ్యవసాయ కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకమూ లేకుండా జరిగేందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టాల్సిందిగా జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. కంటైన్మెంటు జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో వెసులుబాటు కల్పించాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి.
ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం నాట్లు, వ్యవసాయ కూలీల రవాణా, విత్తన విక్రయాలు, ఎరువులు పురుగుమందుల సరఫరా తదితర అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు వెలువడ్డాయి. వ్యవసాయ యంత్రపరికరాల సరఫరా, విక్రయాలు , మరమ్మతులు జరిగే దుకాణాలు, వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలు నిర్వహించే సంస్థలకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ తెరిచి ఉండేలా చూడాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ దుకాణాల వద్ద పెద్ద ఎత్తున గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వ్యవసాయ కూలీల రాకపోకలకు సంబంధించి కూడా దృష్టి పెట్టాలని సూచనలు, స్థానిక వ్యవసాయ అధికారుల సాయంతో వారికి పాసులను జారీ చేసే అంశాలను పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసింది.