పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లింలకు ప్రభుత్వం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో బుధవారం ఇఫ్తార్ విందు ఇచ్చింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు. ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా, వక్ఫ్‌బోర్డు ఛైర్మన్ ఖాదర్‌బాషా, ఉర్దూ అకాడమీ ఛైర్మన్ నదీమ్ అహ్మద్, హజ్ కమిటీ ఛైర్మన్ గౌస్‌లాజం, ఎమ్మెల్యేలు అఫీజ్‌ఖాన్, ముస్తాఫా తదితరులు ఈ సందర్భంగా సీఎంను సన్మానించారు. అనంతరం ముస్లిం మత పెద్దలు ఆయనను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా మాట్లాడుతూ సీఎం జగన్ ముస్లింలు రాజకీయ సాధికారత సాధించే దిశగా చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఉపముఖ్యమంత్రి పదవిని ముస్లింలకు ఇచ్చారని, ఎమ్మెల్సీ పదవుల్లోనూ పెద్దపీట వేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వనిత, జోగి రమేశ్, రోజా, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, సామినేని ఉదయభాను తదితరులు పాల్గొన్నారు.
ముసాఫీర్ ఖానాను ప్రారంభించిన సీఎం జగన్
విజయవాడ వన్‌టౌన్, న్యూస్‌టుడే: విజయవాడ పంజాసెంటర్‌లో గత ప్రభుత్వ హయాంలో రూ.13.88 కోట్లతో నిర్మించిన షాజహూర్ ముసాఫీర్ ఖానాను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఆయన వెంట ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా, హోంశాఖ మంత్రి తానేటి వనిత, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. ప్రారంభం అనంతరం రెండో అంతస్తులోని కల్యాణ మండపాన్ని సీఎం పరిశీలించారు. అక్కడే ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు.