ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కార్పొరేట్ తరహాలో ప్రభుత్వ ఆస్పత్రి సేవలు ఉండాలి: జగన్ - Jagan Review News

వైద్య, విద్యా రంగాల్లో 'నాడు-నేడు'ను ప్రతిష్టాత్మకంగా చేపట్టామని సీఎం జగన్ పేర్కొన్నారు. లక్ష్యంలోగా పనులు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజారోగ్యంలో నాడు-నేడు కార్యక్రమంపై సీఎం సమీక్ష నిర్వహించారు. నాణ్యమైన సేవలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందేలా కచ్చితంగా ప్రమాణాలు పాటించాలని చెప్పారు.

Government Hospital Services Should be Corporate-style: Jagan
Government Hospital Services Should be Corporate-style: Jagan

By

Published : Mar 2, 2021, 6:06 PM IST

కార్పొరేట్ తరహాలో ప్రభుత్వ ఆస్పత్రి సేవలు ఉండాలని ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజారోగ్యంలో నాడు-నేడు కార్యక్రమంపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. హెల్త్‌ క్లినిక్​లు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ప్రాంతీయ ఆస్పత్రులపై సమీక్ష జరిపారు. వైద్య కళాశాలల్లో అభివృద్ధి కార్యక్రమాలు, కొత్త నిర్మాణాలపైనా సీఎం సమీక్ష చేశారు.

వైద్య, విద్యా రంగాల్లో 'నాడు-నేడు'ను ప్రతిష్టాత్మకంగా చేపట్టామని సీఎం జగన్ ఉద్ఘాటించారు. 'నాడు-నేడు'కు సంబంధించి నిధుల కొరత లేకుండా చర్యలు చేపట్టాలన్న ముఖ్యమంత్రి.. లక్ష్యంలోగా పనులు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూసేకరణ, ఇతరత్రా సమస్యలు వస్తే వెంటనే తన దృష్టికి తేవాలని అధికారులకు సూచించారు.

అప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుందామన్న సీఎం జగన్.. ప్రస్తుతం ఉన్న ఆస్పత్రులు, కొత్తగా నిర్మిస్తున్న ఆస్పత్రులు, బోధనాసుపత్రుల్లో నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని చెప్పారు. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, నిర్వహణ, శుభ్రత విషయంలో పాటిస్తున్న ప్రమాణాలన్నీ కూడా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉండాలని స్పష్టం చేశారు.

నాణ్యమైన సేవలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందేలా కచ్చితంగా ప్రమాణాలు పాటించాలని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. దీనికోసం ఎస్‌ఓపీలను తయారుచేసి, వాటిని అమలు చేయాలని ఆదేశించారు. ఉత్తమ వైద్యం, ఉత్తమ నిర్వహణ, ఉత్తమ ప్రమాణాలు పాటించడమే లక్ష్యం కావాలని స్పష్టం చేశారు. ఎంతమంది వైద్యులు అవసరమో.. అందర్నీ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఆస్పత్రినీ నిర్వహించేవారు సమర్థవంతంగా ఉండాలని.. ఆస్పత్రుల నిర్వహణలో అనుభవమున్న నిపుణులను ఇందులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు.

పాడేరు, పులివెందుల, పిడుగురాళ్ల, మచిలీపట్నం సహా కొత్త మెడికల్‌ కాలేజీలు, గిరిజన ప్రాంతాల్లో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు, తదితర పనులపై సమీక్షించారు. మార్చి నెలాఖరుకల్లా వైద్యకళాశాలలు, ఆస్పత్రుల నిర్మాణానికి సంబంధించి భూముల సేకరణ, వాటి చెల్లింపులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మే 15 కల్లా కొత్తగా నిర్మించనున్న మెడికల్‌ కాలేజీలకు టెండర్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఉన్న మెడికల్‌ కాలేజీల్లోనూ అభివృద్ధి పనులకు ఏప్రిల్‌ నెలాఖరు కల్లా టెండర్లు ఖరారు అవుతాయని చెప్పారు. రాష్ట్రంలో వైరస్‌ ప్రస్తుత పరిస్థితి, పాజిటివిటీపై సీఎంకు అధికారులు వివరాలు అందించారు. 69 ఆస్పత్రుల్లో 9,625 బెడ్లు ఇంకా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం వైరస్‌ విస్తరణ మునుపటి ఉద్ధృతితో లేకపోయినా అప్రమత్తంగానే ఉన్నామని వివరించారు.

ఇదీ చదవండీ... ఆంధ్రా ప్యారిస్​లో ఆసక్తిగా పురపోరు..!

ABOUT THE AUTHOR

...view details