మద్యం విక్రయాల ద్వారా ఆదాయం పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజస్ కార్పొరేషన్ (ఏపీఎస్‌బీసీఎల్) కొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. మద్యంపై ఇప్పటివరకూ విధిస్తున్న వ్యాట్‌ను గణనీయంగా తగ్గించి.. ఆ వ్యత్యాసాన్ని సరిచేసేందుకు కొత్తగా ప్రత్యేక మార్జిన్‌ను ప్రవేశపెట్టింది. ఫలితంగా వినియోగదారుడికి విక్రయించే ఎమ్మార్పీ ధరల్లో ఎలాంటి మార్పులు ఉండకపోయినప్పటికీ ఏపీఎస్‌బీసీఎల్‌కు లభించే మార్జిన్ మాత్రం భారీగా పెరగనుంది. ఈ మేరకు వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖలు తాజాగా రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశాయి. వ్యాట్ సవరణకు సంబంధించి బుధవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. బుధవారం నుంచే ఈ మార్పులు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది. తాజా నిర్ణయంతో ఏపీఎస్‌బీసీఎల్ ఇప్పటివరకూ వ్యాట్ రూపంలో వాణిజ్యపన్నుల శాఖకు చెల్లిస్తున్న దాంట్లో కొంత మొత్తాన్ని ఇకపై చెల్లించాల్సిన అవసరం ఉండదు. అలా మిగిలిన మొత్తం ఆదాయం అవుతుంది. ఈ మేరకు కార్పొరేషన్‌కు లభించే మార్జిన్ పెరుగుతుంది. మద్యం ఆదాయాన్ని హామీగా చూపించి ఏపీఎస్‌బీసీఎల్ ద్వారా ఇప్పటికే ప్రభుత్వం రూ.వేల కోట్లు రుణాలుగా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆ సంస్థకు ఎక్కువ ఆదాయం లభించేలా చేసేందుకు వీలుగా తాజాగా సవరణలు తీసుకొచ్చినట్లు ఉందని ఓ విశ్రాంత అధికారి వివరించారు. సవరణలకు కారణమేంటో వివరణ కోసం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవను ‘ఈనాడు’ ప్రతినిధి సంప్రదించేందుకు ప్రయత్నించగా.. ఆయన అందుబాటులోకి రాలేదు. ఏపీఎస్‌బీసీఎల్ ఎండీ వాసుదేవరెడ్డితో ప్రస్తావించగా... ఈ విషయంలో తనను ఏమీ అడగొద్దని సమాధానమిచ్చారు.
*వివిధ కేటగిరీల మద్యంపై ప్రస్తుతం 130 శాతం నుంచి 190 శాతం వరకూ వ్యాట్ వసూలు చేస్తున్నారు. దీన్ని ఇప్పుడు ఆయా కేటగిరీలపై 35 శాతం నుంచి 60 శాతం వరకూ తగ్గించారు.
*ఇప్పటివరకూ మద్యంపై స్పెషల్ మార్జిన్ రేటు లేదు. వివిధ కేటగిరీల మద్యంపై 85 శాతం నుంచి 130 శాతం వరకూ స్పెషల్ మార్జిన్ రేటును కొత్తగా విధించారు.
*సాధారణంగా వ్యాట్ తగ్గిస్తే ఆ మేరకు పన్నుల భారం తగ్గి వినియోగదారుడి నుంచి వసూలు చేసే ఎమ్మార్పీ ధర కూడా తగ్గాలి. అయితే ప్రభుత్వం మాత్రం పన్నులను తగ్గించి.. ఎమ్మార్పీలో తేడా లేకుండా ఉండేందుకు వీలుగా ఆ వ్యత్యాసాన్ని ప్రత్యేక మార్జిన్ రేటు రూపంలో వసూలు చేసుకునే అవకాశం కల్పించింది.