మరోసారి చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న నిఘా విభాగం మాజీ అధిపతి ఏబీ వెంకటేశ్వరరావుపై రాష్ట్ర ప్రభుత్వం మరోమారు క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. రక్షణ, భద్రత పరికరాల కొనుగోలు వ్యవహారంలో నమోదైన అభియోగాలపై కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ విచారణ ముగిసిన తర్వాత ఈ నెల 4న సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు, ఆయనపై శాఖపరమైన ప్రొసీడింగ్స్ పెండింగ్‌లో ఉండగా.. వాటిపై చేసిన వ్యాఖ్యలు అఖిలభారత సర్వీసు (క్రమశిక్షణ, అప్పీలు) నియమావళిలోని ఏడో నిబంధన ప్రకారం దుష్ప్రవర్తన కిందకే వస్తుందంటూ ఆయనపై అభియోగాలు మోపింది. వాటిపై 30 రోజుల్లోగా లిఖితపూర్వకంగా లేదా నేరుగా వాదన వినిపించాలని ఆదేశించింది. ఆ వాదన నమోదు చేసిన అభియోగాలకే పరిమితం కావాలని తెలిపింది.
నిర్దేశిత గడువులోగా వాదనలు వినిపించకపోతే తమ వద్దనున్న వివరాలు, అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఈ కేసు విచారణకు సంబంధించి ఏబీ వెంకటేశ్వరరావు ఆయనకు అనుకూలంగా రాజకీయ నాయకులతో, లేదా ఇతరులతో ఎలాంటి ఒత్తిడి తీసుకురాకూడదని, పైరవీలు, సిఫార్సులు చేయించరాదని వివరించింది. అలా చేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. అందులో ఆయనపై నమోదు చేసిన అభియోగాలు ఇలా ఉన్నాయి.
ఆ ఆరోపణలు హాస్యాస్పదం..
వివేకానందరెడ్డి హత్య కేసులో అప్పటి కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మపై తాను ఒత్తిడి తెచ్చానంటూ చేసిన ఆరోపణలు హాస్యాస్పదమని... ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. వివేకా హత్య తర్వాత పది రోజుల్లోనే రాహుల్ దేవ్ శర్మను కడప ఎస్పీ స్థానం నుంచి ఎన్నికల సంఘం ద్వారా బదిలీ చేయించారని, ఇది ఎవరు చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదన్నారు. అప్పట్లో నిఘా విభాగం సేకరించిన సమాచారాన్ని సీఐడీ, సిట్‌తో పంచుకున్నానని సీబీఐ డైరెక్టర్‌కు రాసిన లేఖలో తాను స్పష్టంగా చెప్పానని ... డీజీపీ కార్యాలయ అధికార ప్రతినిధి బహుశా ఆ విషయం గమనించక ఐపీసీ సెక్షన్ 201 విషయం ప్రస్తావించి ఉంటారని పేర్కొన్నారు. ప్రముఖ రాజకీయ నాయకుడు హత్యకు గురికావటం, అనంతర పరిణామాలు అడుగడుగునా అనుమానాస్పదంగా ఉండటం అత్యున్నత పోలీసు అధికారులను సహజంగానే అప్రమత్తం చేస్తాయన్నారు.
కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ఎదుట విచారణ ముగిసిన అనంతరం ఈ నెల 4న సచివాలయంలో ఏబీ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ... ‘ఏసీబీ సాక్షుల్ని బెదిరించింది. తప్పుడు సమాచారంతో నివేదికల్ని సమర్పించింది. ఫోర్జరీ ఈ-ఫైల్స్‌ను సృష్టించారు. దురుద్దేశపూరితంగా నన్ను ఈ కేసులో ఇరికించారు’ అంటూ దర్యాప్తు అధికారులను అవమానించేలా మాట్లాడారు. ఆయనపై నమోదైన అభియోగాల విషయంలో ఆయన వాదన వినిపించేందుకు తగిన అవకాశం ఇచ్చాం. అయినా సరే కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ఎదుట జరిగిన విచారణపై ఆయన మాట్లాడారు. ప్రభుత్వ చర్యల్ని, ఆయనపై దర్యాప్తు చేసిన అధికారుల్ని విమర్శించారు. ఇది అఖిల భారత సర్వీసు ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించటమే.-ప్రభుత్వం