Government Instructions on Dharani Problems: భూ రికార్డుల ప్రక్షాళన, ధరణి పోర్టల్ అమలు, తదనంతర పరిణామాల్లో ఉత్పన్నమైన సమస్యలు యజమానులకు తీవ్ర ఇబ్బందికరంగా మారాయి. తప్పిదాలు, పొరపాట్లు, బదలాయింపు ప్రక్రియ సందర్భంగా ఏర్పడిన సమస్యలతో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్నీ సవ్యంగా ఉన్న వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా లావాదేవీలు సాఫీగా సాగిపోతుండగా సమస్యల్లో పడిన వారి పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా తయారైంది.
ఇది ప్రభుత్వానికి కూడా ఇబ్బందిగా మారింది. పలు సందర్భాల్లో ఇందుకు సంబంధించిన ప్రస్తావనతో పాటు పరిష్కారం దిశగా కసరత్తు జరిగింది. అందులో భాగంగా పోర్టల్‌లో కొన్ని ఐచ్చికాలు అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికీ సమస్యలు ఇంకా మిగిలిపోయాయి. క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులపై ఇటీవల జరిగిన ఓ సమావేశంలో ఉన్నతాధికారులపై ప్రభుత్వంలోని ముఖ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పంతాలు, పట్టింపులకు పోవాల్సిన అవసరం లేదని సమస్య ఎక్కడ ఉందో సానుకూలంగా ఆలోచించి కలెక్టర్లు, కింది స్థాయి అధికారులకు మార్గనిర్ధేశం చేయాలని సూచించారు.