‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా గృహ నిర్మాణానికి అవసరమయ్యే 12 వస్తువుల ధరలను ప్రభుత్వం ఖరారు చేసింది. మొత్తం 23 రకాల సామగ్రి(మెటీరియల్) అవసరమని గుర్తించి 14 వస్తువులకు రాష్ట్రస్థాయిలో, 9 వస్తువులకు జిల్లా స్థాయిలోనూ టెండర్లు నిర్వహించారు. టెండర్ల ద్వారా వచ్చిన కనిష్ఠ ధరను ప్రాతిపదికగా తీసుకుని సామగ్రి ధరలను ఖరారు చేశారు.
రాష్ట్రస్థాయిలో గాల్వాల్యుమ్ షీట్ (ఇంటి వరండాకు వాడే ప్లాస్టిక్ షీట్లు), నీటి నిల్వ ట్యాంకు మినహా మిగతా 12 రకాల వస్తువుల ధరలు నిర్ణయించారు. ఈ రెండింటి కోసం ఇప్పటికే రెండు సార్లు రివర్స్ టెండర్లు నిర్వహించినా గుత్తేదారుల నుంచి పెద్దగా స్పందన లేదు. దీంతో మరోసారి టెండర్లు పిలవాలని నిర్ణయించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో సిమెంటు బస్తా ధర రూ.235-245(ఓపీసీ), మిగతా పది జిల్లాల్లో రూ.225-235(ఓపీసీ)గా ఖరారు చేశారు. ఒక టన్ను ఇనుము ధర రూ.56,500గా నిర్ణయించారు. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(ఆర్‌ఐఎన్‌ఎల్) ఇనుము ధర రూ.61,400గా ఖరారు చేశారు. ఒక ఇంటి నిర్మాణానికి 90 బస్తాల సిమెంటు, 480కిలోల ఇనుము(కడ్డీలు) ఇస్తారు.
ప్రత్యేకంగా మొబైల్ యాప్ రూపకల్పన..
గృహనిర్మాణ సంస్థ ద్వారా అందించనున్న సామగ్రి, వాటి ధరలను లబ్ధిదారులకు తెలియజేసేందుకు వీలుగా ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను రూపొందించారు. దీన్ని గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయంలోని ఇంజినీరింగ్ అసిస్టెంట్‌కు అందుబాటులో ఉంచుతారు. వీరు సామగ్రి, వాటి ధరలను లబ్ధిదారులకు తెలిపి వారి నుంచి సమ్మతి తీసుకోవాలి. ఆ మేరకు సరఫరా చేస్తారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే స్థానికంగానే తక్కువ ధరకు సామగ్రి అందుబాటులో ఉంటే లబ్ధిదారులు వాటినే కొనుగోలు చేసుకోవచ్చు. గృహనిర్మాణ సంస్థ నుంచి తీసుకున్న సామగ్రికి నిర్దేశిత ధర మేర రాయితీ నుంచి మినహాయిస్తారు.