ఆరోగ్యశ్రీ ట్రస్టు పరిధిలోని ఆస్పత్రులు 'నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్- 'ఎన్ఎబిహెచ్' గుర్తింపు పొందేందుకు ప్రభుత్వం కాలపరిమితి పెంచింది. ఆసుపత్రుల పనితీరు, మౌలిక సదుపాయాల కల్పన, చికిత్స తీరు ఆధారంగా.... శ్రేణులు కేటాయించింది. వీటి ప్రాతిపదికన... తప్పనిసరిగా ఎన్ఎబిహెచ్ నుంచి గుర్తింపు పొందాలని కాలపరిమితి విధిస్తోంది. తగిన ప్రమాణాల ఆధారంగా పనిచేస్తేనే ఆసుపత్రులకు గుర్తింపు లభిస్తోంది. ఇందువల్ల రోగులకు మెరుగైన చికిత్స అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఈ గుర్తింపు లభిస్తే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి అదనంగా 2 శాతం చెల్లిస్తారు.
ఆరోగ్యశ్రీ ట్రస్టు అధికారులు రాష్ట్రంలో అనుబంధ గుర్తింపు కలిగిన ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోని మౌలిక సదుపాయాలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని.... వంద మార్కులతో ప్రశ్నావళి రూపొందించారు. ఆపరేషన్ థియేటర్, అక్కడున్న సౌకర్యాలు, పరిశుభ్రత వంటి అంశాల ఆధారంగా మార్కులు కేటాయించారు. 90 శాతం మార్కులు పొందిన ప్రైవేటు ఆసుపత్రులకు ఎ+ శ్రేణి కేటాయించారు. ఎ శ్రేణిలో 302, బి శ్రేణిలో 107 ఆసుపత్రులున్నాయి. 278 ప్రైవేటు ఆసుపత్రులు దంతవైద్యం అందిస్తున్నాయి. ఇందులో 114 ఎ+, 127 ఎ, 37 ఆసుపత్రులు బి శ్రేణిలో ఉన్నాయి. మొత్తంగా ఆరోగ్యశ్రీ పరిధిలో 529 ప్రైవేటు ఆసుపత్రులు, 278 దంత వైద్యశాలలు ఉన్నాయని.. వైద్యారోగ్యశాఖమంత్రి ఆళ్ల నాని తెలిపారు.
ఆరోగ్యశ్రీ పరిధిలోని 31 ఆసుపత్రులకు ఇప్పటికే ఎన్ఎబిహెచ్ గుర్తింపు ఉంది. ఎ+ శ్రేణిలో ఉన్న ఆసుపత్రులకు ఏడాదిలోగా, ఎ శ్రేణిలోని ఆసుపత్రులు ఏడాదిన్నరలోగా గుర్తింపు పొందాలని షరతు విధించారు. బి శ్రేణిలోని ఆసుపత్రులు 6 నెలల్లోగా.... ఎ గ్రేడ్ ఆసుపత్రులుగా అప్‌గ్రేడ్ కావాలి. అక్కడి నుంచి ఏడాదిన్నరలోపు తప్పనిసరిగా ఎన్ఎబిహెచ్ గుర్తింపు పొందాలి.