పేదల ఇళ్ల స్థలాలకు సంబంధించి ప్లాట్ల సరిహద్దులు పక్కాగా ఉండాలి. లబ్ధిదారుల వివరాలు నమోదులో ఎలాంటి పొరపాట్లు ఉండకూడదు.. - మండల అధికారులకు జిల్లా కేంద్రం నుంచి ఉన్నతాధికారుల ఆదేశాలు
రేషన్ కార్డుల ఈకేవైసీ మంగళవారం పూర్తి చేయాల్సిందే.. ఒక్కరోజులోనే ఇంటింటికి తిరిగి తొలగింపులు వంటివి చేపట్టండి..- జిల్లా ఉన్నతాధికారి సూచనలతో గ్రామ సచివాలయ సిబ్బందికి సెల్ కాన్ఫరెన్స్‌లో ఎంపీడీవోల ఆదేశం
ఓ వైపు కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఇంటి నుంచి బయటకు రావడమంటేనే సాహసంతో కూడుకున్నది.. అయితే ప్రభుత్వ ఉద్యోగులు కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి కృషి చేస్తూనే మరోవైపు వివిధ పథకాల అమల్లో చురుగ్గా పాల్గొనాల్సి పరిస్థితి నెలకొంది. ఈక్రమంలో పలువురు కొవిడ్ బారినపడుతున్నారు. ప్రస్తుత వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కత్తి మీద సాములా విధులు నిర్వహిస్తున్నామని ఉద్యోగులు వాపోతున్నారు.
ఊరూవాడా కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు 39వేల మంది, 25 వేల మంది ఉపాధ్యాయులు, వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో 10 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు విధులకు హాజరవుతున్నారు. చిలకలూరిపేటలో అత్యవసరంగా సేవలందిస్తున్న వైద్య ఆరోగ్యశాఖ, పోలీస్ విభాగాలలో ఎక్కువ మంది కరోనా బారినపడ్డారు. చిలకలూరిపేట రూరల్, అర్బన్ సర్కిళ్లలో ప్రధాన అధికారులతో పాటు సిబ్బంది, హోం గార్డులు, వారి కుటుంబ సభ్యులకు పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆసుపత్రుల్లో చేరారు. దాచేపల్లి తహశీల్దారుగా పని చేస్తున్న లెవీ కరోనా నుంచి కోలుకొని ఇటీవల విధులకు హాజరయ్యారు. బాపట్ల, నరసరావుపేట తహశీల్దారు కార్యాలయాల్లో పలువురు వైరస్ బారినపడటంతో కొద్ది రోజులు మూసేశారు. జిల్లాలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ ఒకటి రెండు కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వ పథకాలు అమలు చేయడం తమకు సవాలుగా మారిందని ఉద్యోగులు చెబుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు రోజూ వీడియో కాన్ఫరెన్స్, సెల్‌ఫోన్ ద్వారా లక్ష్యాలు విధించడంతో ఒత్తిడి ఎదుర్కొంటున్నామని అంటున్నారు. కరోనా తీవ్రత ఉన్నందున క్షేత్రస్థాయిలో ఇబ్బందికర పరిస్థితులున్నాయని, పనులు అనుకున్నమేర ముందుకు సాగడం లేదని వివరిస్తున్నారు.