ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

స్థిరాస్తి వ్యాపారం లే‘అవుట్‌’.. ప్రభుత్వ నిర్ణయంతో తగ్గిన దరఖాస్తులు - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

DELAY IN LAYOUTS: కొత్త లేఅవుట్లకు అత్యధికంగా అనుమతులిచ్చే పట్టణాభివృద్ధి సంస్థల్లో విశాఖ మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్డీఏ) ఒకటి. 2022-23లో ఇక్కడ ఇప్పటివరకు కేవలం ఒకే లేఅవుట్‌కు అనుమతి తీసుకున్నారు. ఈ ఏడాది దరఖాస్తులు భారీగా తగ్గాయి. గత ఏడాది ఇదే సంస్థ 97 లేఅవుట్లకు అనుమతులిచ్చింది.

DELAY IN LAYOUTS
DELAY IN LAYOUTS

By

Published : Jul 8, 2022, 8:10 AM IST

DELAY IN LAYOUTS:ప్రైవేట్‌ లేఅవుట్లలో 5శాతం స్థలాన్ని వైఎస్‌ఆర్‌ జగనన్న హౌసింగ్‌ ప్రాజెక్టులకు కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయం కొత్త అనుమతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గత ఏడాది దాదాపు 350 లేఅవుట్లకు వ్యాపారులు అనుమతులు తీసుకున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 20 లేఅవుట్ల (5.71%)కు మాత్రమే అనుమతులు పొందారు. గత ఏడాది 350 లేఅవుట్లకు ఇచ్చిన అనుమతుల ప్రకారం చూసినా...నెలకు సగటున 29 చొప్పున త్రైమాసికానికి 87 వస్తాయి. అయితే 2022-23 మొదటి త్రైమాసికంలో 20 లేఅవుట్లకే వ్యాపారులు అనుమతులు తీసుకున్నారు. తగ్గిన దరఖాస్తులతో పట్టణాభివృద్ధి సంస్థలకు వచ్చే ఆదాయం కూడా పడిపోయింది. ఏటా రూ.50 కోట్ల వరకు ఫీజుల కింద వచ్చేది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ ఏడాది 50% ఆదాయం రావడం కష్టమేనని అధికారులు అంటున్నారు.

మూడు ఐచ్ఛికాలపైనా వ్యాపారుల్లో అసంతృప్తి
*ఇళ్ల స్థలాల కోసం వేసే లేఅవుట్లలో ఉన్నత, మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువగా ప్లాట్లు కొనుగోలు చేస్తుంటాయి. లేఅవుట్‌లో పేదల ఇళ్ల కోసం 5శాతం స్థలాన్ని కేటాయిస్తే..ఇదే చోట కొనుగోళ్లుకు ఉన్నత, మధ్య తరగతి కుటుంబాలు ఎందుకు ముందుకొస్తాయని వ్యాపారులు అంటున్నారు.

*లేఅవుట్లలో స్థలం ఇవ్వదలచుకోని వ్యాపారులు బేసిక్‌ విలువ మేరకు ఐదు శాతానికి డబ్బు చెల్లించాలన్న ప్రభుత్వ సూచనపైనా వ్యాపారుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ శివారులో పదెకరాల్లో వేసిన లేఅవుట్‌కు ప్రభుత్వం చెబుతున్న ప్రకారమైతే రూ.5 కోట్ల వరకు డబ్బు చెల్లించాల్సి వస్తుందని ఓ స్థిరాస్తి వ్యాపార సంస్థ నిర్వాహకుడు శివాజీ తెలిపారు. వ్యాపారం అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితుల్లో లేఅవుట్‌ అనుమతులకు ఫీజులతోపాటు మళ్లీ 5శాతం స్థలానికి డబ్బు కట్టి వ్యాపారం చేయడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు.

*లేఅవుట్‌కు 3 కిలో మీటర్ల దూరంలో 5శాతం స్థలాన్ని కేటాయించినా అభ్యంతరం లేదంటూ ప్రభుత్వం కల్పించిన మరో వెసులుబాటుపైనా వ్యాపారుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పదెకరాల స్థలంలో లేఅవుట్‌ కోసం అర ఎకరం (5%) స్థలాన్ని వేరొకచోట మళ్లీ కొని ఇవ్వడం ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదని వ్యాపారులు అంటున్నారు. కేవలం అర ఎకరం స్థలాన్ని విక్రయించేందుకు రైతులు ముందుకు రావడం లేదని విజయవాడకు చెందిన స్థిరాస్తి వ్యాపారి సుబ్బారావు తెలిపారు.

*ప్రైవేట్‌ లేఅవుట్‌లో 5% స్థలాన్ని పేదల ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించాలన్న విధానం దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేదని వ్యాపారులు చెబుతున్నారు.

అనుమతులు తీసుకోకుండా వెలుస్తున్న లేఅవుట్లు
లేఅవుట్‌లో 5% స్థలాన్ని కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయం తరువాత రాష్ట్రంలో పలుచోట్ల అనుమతులు తీసుకోకుండా పలువురు లేఅవుట్లు వేసి వ్యాపారం చేసుకుంటున్నారు. రాజకీయ అండతో వీరు ప్లాట్లు విక్రయిస్తున్నారు. విషయం అధికారులకు తెలిసినా అధికార పార్టీ ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవడంతో చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలోని పలు నగరాల్లో అనధికార లేఅవుట్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. అనుమతులు తీసుకోని లేఅవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు కూడా తాజాగా అనుమతించడంతో వ్యాపారుల పని కూడా సులువైంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details